
ఈ సందేహం దాదాపు అందరికీ కలుగుతుంది. ఎందుకంటే, మరణించిన తండ్రి తిథినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయంలో అనాది నుంచి వస్తున్న ఆచారం...ప్రతి సంవత్సరం చేసే శ్రాద్ధం కన్నా అతి ముఖ్యమైన శ్రాద్ధాలు ఈ మహాలయపక్షం పదిహేను రోజులు చేయలేనివారు ఒక్క మహాలయమైనా చేసి తీరాలని చెబుతోంది శాస్త్రం...
పితృతిథినాడు పుత్రుడు తన తండ్రి, తాత, మత్తాతలను తలచుకుని పితృ యఙ్ఞాన్ని నిర్వహిస్తాడు...
పుత్రులు లేనివారి సంగతి ఏమిటి మరి? వారి గతి అథోగతేనా? అంటే..కాదు’ అంటుంది శాస్త్రం. మన కుటుంబాలలో ఏ కారణం చేతనో పెళ్లికాని సోదర, సోదరీలు మరణించి ఉండవచ్చు, లేదా..పెళ్లయినా సంతానం కలుగని దంపతులు మరణించి ఉండవచ్చు...
లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు, లేదా యుద్ధాలలో కానీ, శిక్షల ద్వారా కానీ, ఆత్మహత్యల ద్వారా కానీ, ప్రకృతి వైపరీత్యాల (వరదలు, భూకంపాలు) ద్వారా కానీ గుర్తు తెలియక మరణించి ఉండవచ్చు...అటువంటి వారందరికి కూడా తిలోదకాలిచ్చి వారిని ఊర్థ్వలోకాలకు పంపడం కోసం ఈ ‘మహాలయ పక్షాలు’ నిర్దేశించబడ్డాయి.
పితృతిథి నాడు మూడు తరాలవారికి (తండ్రి, తాత, ముత్తాత) మాత్రమే తిలోదకాలతో, పిండప్రదానం యివ్వబడుతుంది. ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి, తద్దినం పెట్టకపోతే.., ఆ తద్దినం పెట్టని దోషం ‘మహాలయం’ పెట్టడం వలన పోతుంది.
ఎలా పెట్టాలంటే..?
సాధారణంగా తండ్రి చనిపోయిన తిథినాడు ‘మహాలయం’ పెట్టడం ఉత్తమం. ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలుకాని పరిస్థితిలో ‘మహాలయ అమావాస్య’నాడు పెట్టడం ప్రశస్తం. దీనినే ‘సర్వ పితృ అమావాస్య’ అంటారు. ఈ రోజునే మరణించిన బంధువులందరికీ..వారి వారి తిథులతో సంబంధం లేకుండా ‘మహాలయం’ పెట్టాలి.
మహాలయం పెట్టే కర్త శుచిగా స్నానంచేసి, పవిత్రమును(దర్భలతో చేసిన ఉంగరం) ధరించి, శ్రధ్ధగా, భక్తిగా, మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణభోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి. మహాలయం పెట్టలేని పక్షంలో కనీసం గతించిన పెద్దలను తలచుకుని వారి పేరు మీదుగా శక్తిమేరకు శుచిగా వంట చేసి భోజనాలు పెట్టాలి.
ఇలాంటి క్రతువులపై విశ్వాసం లేనివారు కూడా పేదలకు అన్నదానం చేయడం ఆవులకు పచ్చగడ్డి తినిపించడం, శునకాలకు, కాకులకు ఆహారం పెట్టడం మంచిది. మహాలయ పక్షాలలో శ్రాద్ధ కర్మ చేత పితృదేవతలకు సంతృప్తి కలిగించిన వ్యక్తికి భౌతికంగా సుఖ సంతోషాలు, పరలోకంలో ఉత్తమ గతులు లభిస్తాయని శాస్త్రవచనం.
(సెప్టెంబర్ 8 నుంచి 21 వరకు మహాలయ పక్షాలు)