బెల్టు తీసిన మహిళలు

Tribal Womens Attack And Brokn Belt Shops in West Godavari - Sakshi

గిరిజన గ్రామాల్లో మద్యాన్ని నిషేధించాలని ఉద్యమబాట

రెడ్డి గణపవరంలో బెల్టు దుకాణాలపై దాడులు

పశ్చిమగోదావరి, బుట్టాయగూడెం: గిరిజన గ్రామాల్లో మద్యాన్ని నిషేధించాలని కోరుతూ గిరిజన మహిళలు, యువకులు ఉద్యమబాట పట్టారు. దీనిలో భాగంగా సోమవారం రాత్రి రెడ్డిగణపవరం గ్రామంలో మద్యం అమ్మకాలపై కన్నెర్ర చేశారు. గ్రామానికి చెందిన గిరిజన మహిళలు, అల్లూరి సీతారామరాజు యూత్‌ సభ్యులు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న ప్రదేశాలకు వెళ్లి అక్కడ లభించిన మద్యం సీసాలను తీసుకుని గ్రామాల నడుబొడ్డున వాటిని పగలకొట్టారు. మూడు ప్రదేశాల్లో సుమారు 30 సీసాలు తమకు లభించాయని మహిళాసంఘం నాయకురాలు గుండి దుర్గ, దారి బజారమ్మలు తెలిపారు. గ్రామాల్లో బెల్ట్‌షాపులు లేకుండా చేయాలని మొత్తుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రాత్రీపగలు కష్టపడి పనిచేసిన డబ్బులు కుటుంబ యజమానులు మద్యం కోసం తరలిస్తున్నారని దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని తెలిపారు. పండుగలు వస్తున్న తరుణంలో మరింత గడ్డు పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నందున గ్రామాల్లో మద్యాన్ని నివారించేందుకు పూనుకున్నామని చెప్పారు. గ్రామాల్లో మద్యం అమ్మితే మరిన్ని దాడులు చేయడంతో పాటు అమ్మకాలు చేసేవారిని పోలీసులకు అప్పగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కట్టం సావిత్రి, పూనెం వేణి, యువకులు మల్లేష్, రమేష్, పవన్, కోటి, రమణ, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top