దారి కాసిన ప్రమాదం

Travel Bus Accidents in West Godavari National Highway - Sakshi

జాతీయ రహదారి పక్కనే వాహనాల పార్కింగ్‌

ట్రావెల్స్‌ బస్సులదీ అదే తీరు

16వ నంబర్‌ ఎన్‌హెచ్‌పై నిత్యం ప్రమాదాలు

పశ్చిమగోదావరి, తణుకు : నేషనల్‌ హైవేపై రోడ్డు పక్కనే నిలిపి ఉంచిన లారీని ఢీకొన్న సంఘటన.. ఆగి ఉన్న వాహనాన్ని తప్పించబోయి కాల్వలోకి దూసుకెళ్లిన మరో సంఘటన.. ఇలా పదహారో నంబర్‌ జాతీయ రహదారి నిత్యం జరుగుతున్న ప్రమాదాలతో రక్తసిక్తమవుతోంది. రెండు జాతీయ రహదారులు జిల్లా మీదుగా వెళుతున్నాయి. అందులో 16వ నంబర్‌ జాతీయ రహదారి అత్యంత కీలకం. చెన్నై నుంచి కోల్‌కతా వెళ్లే ఈ రహదారి మీదుగా నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తాయి. జిల్లాలో మెజారిటీ ప్రాంతం ఈ రహదారి మీదే ఉంది. జిల్లాలో కలపర్రు టోల్‌గేట్‌ వద్ద నుంచి ప్రారంభమై ఏలూరు, దెందులూరు, భీమడోలు, తాడేపల్లిగూడెం, తణుకు మీదుగా సిద్ధాంతం మీదుగా తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశిస్తుంది.

ఈ జాతీయ రహదారిపై నిత్యం జరుగుతున్న ప్రమాదాల కారణంగా ఏటా పదుల సంఖ్యలో ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రధానంగా రోడ్డు  పక్కనే నిలిపి ఉంచిన వాహనాల కారణంగానే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటీవల అధికారులు సైతం నిర్థారించారు. మరోవైపు ఇటీవలి కాలంలో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు సైతం ఈ రహదారిపైనే బస్సులను ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో 8 గంటల నుంచి 11 గంటల వరకు ఈ తంతు నడుస్తోంది. తణుకు పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డుతో పాటు సొసైటీ రోడ్డు, శర్మిష్ట జంక్షన్, తేతలి వైజంక్షన్‌ ఇలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో అడ్డదిడ్డంగా వాహనాలు నిలుపుతున్నారు. ఇలాంటి వాహనాలకు అడ్డుకునేందుకు రవాణా, పోలీసు శాఖ అధికారులు దృష్టి సారించకపోవడంతో ప్రమాదాలు నిత్యకృత్యంగా మారిపోతున్నాయి.

అడుగడుగునా లోపాలు
చెన్నై నుంచి కోల్‌కతా వరకు నాలుగు లేన్లలో విస్తరించిన పదహారో నంబర్‌ జాతీయ రహదారి తణుకు మండలం దువ్వ  నుంచి సుమారు 12 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీగా ఉంటోంది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా పట్టణం, గ్రామాలు విస్తరిస్తుండటంతో రోడ్డు దాటేందుకు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా సెంటర్లలో నిర్వహణ లోపం నిర్వహణ లోపం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించడానికి ఏర్పాటు చేసిన సూచికలు, హెచ్చరిక బోర్డులు శిథిలావస్థకు చేరుకున్నాయి.

దీంతో పాటు ఆయా సెంటర్లలో బస్సులు, ఇతరత్రా వాహనాలు నిలిపేందుకు బస్‌బే పేరుతో స్థలం వదలాల్సి ఉండగా ఎక్కడా ఇలాంటి చర్యలు తీసుకోలేదు. సుదూర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వాహన చోదకులు విశ్రాంతి తీసుకోవడానికి ప్రతి 40 కిలోమీటర్లకు 5 ఎకరాల చొప్పున స్థలం కేటాయించాల్సి ఉండగా ఎక్కడా అమలు కావడంలేదు. దువ్వ సమీపంలోని వెంకయ్య వయ్యేరు, దువ్వ జంక్షన్, తేతలి గ్రామ జంక్షన్, తేతలి జంక్షన్, అయ్యప్పస్వామి దేవాలయం జంక్షన్, శర్మిష్ట జంక్షన్, ఉండ్రాజవరం జంక్షన్, పెరవలి వై జంక్షన్‌ తదితర ప్రాంతాలను ప్రమాదకర జంక్షన్లుగా గుర్తించారు. అయితే ఆయా జంక్షన్లలో రోడ్డు పక్కనే వాహనాలు ఉంచుతుండటంతో ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

చర్యలు తీసుకుంటాం..
రోడ్డు పక్కనే నిలిపి ఉంచే వాహనాలను నియంత్రించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రాత్రి సమయాల్లో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నిలపకుండా చర్యలు తీసుకుంటాం. ట్రావెల్స్‌ యజమానులతో సమావేశం ఏర్పాటు చేసి హెచ్చరిస్తాం. ప్రధానంగా హైవేపై వాహనాలు నిలిపి ఉంచితే కేసులు నమోదు చేస్తాం.– డీఎస్‌.చైతన్యకృష్ణ, సీఐ, తణుకు

ట్రావెల్స్‌ దందా
హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరు, ముంబై వంటి పట్టణాలకు నిత్యం తణుకు పట్టణం మీదుగా ట్రావెల్స్‌ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం సుమారు 20 నుంచి 30 వరకు బస్సులు పట్టణంలోకి వచ్చి వెళుతుండగా మరో వందకు పైగా బస్సులు హైవే మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. తణుకు పట్టణంలోని పలువురు ట్రావెల్స్‌ యజమానులు బుక్కింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. అయితే ట్రాఫిక్‌ రద్దీగా ఉండే సమయాల్లో ముఖ్యంగా రాత్రి 8 గంటల నుంచి 11 గంటల వరకు ప్రధాన రోడ్లుపై ట్రావెల్స్‌ బస్సులు నిలిపి ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి దేవాలయం, టౌన్‌హాల్‌ కాంప్లెక్స్, సొసైటీ రోడ్డులోని కామథేను కాంప్లెక్స్, పాలిటెక్నిక్‌ కళాశాల సెంటర్‌లలో నిత్యం పదుల సంఖ్యలో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులు నిలుపుతున్నారు. మరోవైపు హైవేపై సైతం ట్రావెల్స్‌ బస్సులు విచ్చలవిడిగా నిలుపుతుండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఇస్తున్నాయి.ప్రధాన కూడళ్లలో ఇలా బస్సులు నిలుపుతుండగా వేగంగా వచ్చే వాహనాలు గుర్తించలేకపోతున్నాయి. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నియంత్రించాల్సిన హైవే పెట్రోలింగ్‌ సిబ్బంది పట్టించుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top