అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించింది.
మృతదేహంతో ఆందోళన
Feb 24 2014 12:46 AM | Updated on Sep 2 2017 4:01 AM
	అమలాపురం రూరల్, న్యూస్‌లైన్ :అమలాపురం ఈదరపల్లి వంతెన వద్ద ట్రాన్స్‌ఫార్మర్ పేలిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించింది. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ ఆమె బంధువులు, ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ఈదరపల్లిలోని సబ్‌స్టేషన్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ నెల 19న అమలాపురం సమీపంలోని ఈదరపల్లి వంతెన వద్ద రోడ్డు పక్కగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ పేలిన సంఘటనలో కూతాడి పెద్దింట్లమ్మ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆమె వీపుపై ట్రాన్స్‌ఫార్మర్‌లోని మరుగుతున్న ఆయిల్ పడడంతో మంటల్లో చిక్కుకుని 70 శాతానికి పైగా కాలిపోయింది. ఆమెను తొలుత అమలాపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ మూడు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె శనివారం రాత్రి మరణించింది.
	 
	 
	 
					
					
					
					
						
					          			
						
				
	 కాకినాడలో పోస్ట్‌మార్టం అనంతరం ఆమె మృతదేహంతో భర్త ముకుంద్, బంధువులు, ఎరుకుల సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో అమలాపురం ఈదరపల్లిలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. అక్కడే బైఠాయించి తమకు న్యాయం చేయాలంటూ ధర్నా చేశారు. మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్‌రరగేషియా, మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పట్టణ సీఐ శ్రీనివాసబాబు, ఎస్సైలు డి.రామారావు, యాదగిరి సంఘటన స్థలానికి చేరుకుని, ఆందోళనకారులతో చర్చించారు. స్నేహిత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు కుంచే స్వర్ణలత, ఈదరపల్లి సర్పంచ్ నక్కా సంపత్‌కుమార్, న్యాయవాది నల్లి సుధీర్.. ట్రాన్స్‌కో ఏఈ ఎం.సతీష్‌తో చర్చలు జరిపారు. 
	 పెద్దింట్లమ్మకు తామే వైద్యం చేయించామని, అయినా ఫలితం లేకుండా పోయిందని, ట్రాన్స్‌కో నుంచి రూ.లక్ష పరిహారం చెల్లిస్తామని, అదనంగా పరిహారం వచ్చేలా కృషి చేస్తామని ఏఈ హామీ ఇచ్చారు. ఉద్యోగం విషయం తమ పరిధిలో లేదని చెప్పారు. దీనితో సంతృప్తి చెందని ఆందోళనకారులు ఆరు గంటలకు పైగా మృతదేహంతో ఆందోళన కొనసాగించారు. మృతురాలి కుటుం బానికి ఎక్స్‌గ్రేషియాతో పాటు ప్రభుత్వ ఉద్యోగం విషయమై అధికారులకు ప్రతి పాదనలు పంపుతామని, తగిన న్యాయం చేస్తామని ఏఈ హామీ ఇవ్వడంతో రాత్రి 8.30 గంటల సమయంలో ఆందోళన విరమించారు.
Advertisement
Advertisement

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
