కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో విషాదం

Tragedy At Kurnool Government Hospital - Sakshi

కాలేయవ్యాధి బాధితుడిని ఓపీ వద్దకు తీసుకెళ్లేందుకు వీల్‌చైర్‌ ఇవ్వని సిబ్బంది

సాక్షి, కర్నూలు(హాస్పిటల్‌): అసలే కాలేయ వ్యాధి.. అడుగు తీసి వేయడానికి నరకయాతన పడుతున్నాడు.. ఆస్పత్రి ఓపీ వద్దకు వెళ్లాలంటే.. చాలా దూరం. తన భర్త అంతదూరం నడవలేడని భావించిన ఆ ఇల్లాలు స్ట్రెచర్‌/వీల్‌చైర్‌ను ఇవ్వాల్సిందిగా ఆస్పత్రి సిబ్బందిని వేడుకుంది. వారు కనికరించకపోవడంతో చేసేదేంలేక అతికష్టం మీద భర్తను నడిపించుకుంటూ తీసుకెళుతుండగా.. తీవ్ర అస్వస్థతకు గురై ఓపీ వద్ద మెట్లెక్కుతూ ప్రాణాలొదిలాడు. ఈ ఘటన గురువారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. బెలుం గ్రామానికి చెందిన ఐజన్న కొద్దికాలంగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు.

గురువారం ఉదయం భార్య శిరోమణి ఓ వాహనంలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చింది. ముందుగా సర్జికల్‌ ఓపీకి వెళ్లగా.. అక్కడి వైద్యులు పరీక్షించి జీర్ణకోశ వ్యాధుల విభాగం ఓపీ (ఓపీ నెం.26)కి వెళ్లాలని సూచించారు. అసలే నడవలేని మనిషి.. ఆ ఓపీ విభాగం ఎక్కడుందో చూసొస్తే బాగుంటుందని భర్తను అక్కడే ఉంచి ఓపీ వద్దకెళ్లింది. తన భర్త ఇంత దూరం నడవలేడని భావించి.. క్యాజువాలిటీకి వెళ్లి అతని పరిస్థితిని వివరించిం స్ట్రెచర్‌/వీల్‌చైర్‌ ఇవ్వాలని బతిమాలింది. ఇక్కడి రోగులకే స్ట్రెచర్‌ ఇస్తామని, బయటి వారికి ఇచ్చేదిలేదని సిబ్బంది చెప్పడంతో చేసేదేంలేక భర్తను మెల్లగా నడిపించుకుంటూ తీసుకెళుతుండగా అలసిపోయి పడిపోయాడు. సపర్యలు చేశాక మొదటి అంతస్తులో ఉండే ఓపీ వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఐదు మెట్లు ఎక్కగానే ఐజన్న తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top