
సర్టిఫికెట్ల పరిశీలన జరగనున్న జెడ్పీ ప్రాంగణం
సాక్షి, కర్నూలు (అర్బన్): జిల్లాలో సచివాలయ పోస్టుల భర్తీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. జిల్లాలో మొత్తం 9,596 పోస్టులు ఉండగా.. 2,01,886 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన పరీక్షలకు 1,80,728 మంది హాజరయ్యారు. గురువారం ఫలితాలు వెలువడగా.. 58,249 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జిల్లాకు ఎంపిక జాబితా చేరింది. శనివారం ఉదయం నుంచే పోస్టులకు అనుగుణంగా ఆయా ప్రభుత్వ శాఖలకే ఎంపిక జాబితాలను పంపించారు. ఆయా ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులే రూల్ ఆఫ్ రిజర్వేషన్, మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు జిల్లా కలెక్టర్ అనుమతితో కాల్ లెటర్లు, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా సమాచారం పంపించేందుకు చర్యలు చేపట్టారు. ఎంపికైన అభ్యర్థులందరికీ 22వ తేదీ ఉదయానికల్లా సమాచారం అందే అవకాశం ఉంది. కాల్ లెటర్లు, ఎస్‌ఎంఎస్‌లు అందిన వెంటనే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
23 నుంచి ధ్రువపత్రాల పరిశీలన
సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల పరిశీలన ఈ నెల 23, 24, 25వ తేదీల్లో జిల్లా పరిషత్ ప్రాంగణంలో నిర్వహించనున్నారు. జెడ్పీ ప్రాంగణంలోని డీపీఆర్‌సీ భవనం, సమావేశపు హాలు, మినీ మీటింగ్ హాలు, పీఆర్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన విశ్వేశ్వరయ్య భవన్, మండల పరిషత్ కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. ఆయా ఉద్యోగాలకు సంబంధించి వేర్వేరుగా.. అభ్యర్థులు ఇబ్బంది పడకుండా బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.