సర్టిఫి‘కేటుగాళ్లు’

21 Candidates Submits Fake Certificates In Welfare Secretariat Posts In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : ప్రభుత్వ కొలువు తెచ్చుకునేందుకు కొందరు అడ్డదారులు తొక్కారు. సచివాలయ పోస్టులకు సంబంధించి వార్డు వెల్ఫేర్‌ కార్యదర్శుల పోస్టులకు 21 మంది అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా సర్టిఫికెట్లను దాఖలు చేశారు. వాటిని నిశితంగా పరిశీలించాల్సిన వెరిఫికేషన్‌ అధికారులు అభ్యర్థులకే వత్తాసు పలికారు. అయితే అడ్డగోలు బాగోతం నగర పాలక సంస్థ కమిషనర్‌ పి.ప్రశాంతి దృష్టికి వెళ్లింది. దీంతో ఆమె ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ సత్యనారాయణ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన వెంటనే స్పందించారు. అడ్డదారిలో ఉద్యోగాలు పొందిన వారి నియామకాలను రద్దు చేయడంతో పాటు వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ధ్రువీకరణ పత్రాల పరిశీలన సరిగా చేయని తాడిపత్రి, హిందూపురం, పామిడి, కళ్యాణదుర్గం, తదితర ప్రాంతాలకు చెందిన 15 మంది అధికారులపై చార్జెస్‌ ఫ్రేమ్‌ చేయాలని ఆదేశించారు. 

ఇదీ సంగతి 
సచివాలయ ఉద్యోగాల భర్తీలో భాగంగా వార్డు వెల్ఫేర్‌ కార్యదర్శుల అభ్యర్థులకు సెప్టెంబర్‌ 26న అంబేడ్కర్‌ భవన్‌లో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహించారు. అందులో 21 మంది అభ్యర్థులు బీఎస్సీ, బీకాం, ఎంఏ కోర్సులతో దరఖాస్తు చేసుకున్న వారు ఉన్నారు. వాస్తవానికి వార్డు వెల్ఫేర్‌ కార్యదర్శుల పోస్టులకు బీఏ ఆర్ట్స్, హ్యుమానిటీస్‌ చేసిన వారు అర్హులు. కానీ బీఎస్సీ, బీకాం, బీజెడ్‌సీ చేసిన వారు దరఖాస్తు చేసుకుని ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్లను సైతం అందజేశారు. వాటిని పరిశీలించిన అధికారులు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగా.. నియామకపత్రాలు కూడా అందుకున్నారు. 

వెలుగులోకి ఇలా 
అయితే ఉద్యోగాలు దక్కించుకోలేని కొందరు అభ్యర్థులు రెండ్రోజుల క్రితం కమిషనర్‌ పి.ప్రశాంతికి ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు మంజూరు చేశారని, తాము ఆ కోర్సు చేసినా ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. దీంతో కమిషనర్‌ ప్రశాంతి.. ఉద్యోగాలు దక్కించుకున్న వారి సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని నగరపాలక సంస్థ సిబ్బందిని శుక్రవారం ఆదేశించారు. దీంతో అసలు విషయం బయటపడింది. కమిషనర్‌ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లగా ఆయన 21 మంది నియామకాలు రద్దు చేశారు.  

21 మంది అనర్హులు వీరే 
ఆర్‌ నటరాజ్‌ (191215002079), పి.రాజశేఖర(191215002308), ఎకిల గిరిప్రసాద్‌(191215002759), కేవీ అమర్‌నాథ్‌ (191215003206), కె.కృష్ణవేణి(191215003394), గూడూరు వెంకటేశు(191215002877), ఎన్‌పీ వెంకటనారాయణ (191215002029) బి.శ్రీదేవి(191215003446), గోరువ సుమలత(191215002050), సారే శంకర్‌(191215001262), వడ్డే రామకృష్ణ (191215000049), బి.మంజుల(191215002247), జె.ఓబుళమ్మ(191215001644), ఏ.శైలజ (191215001327), బి.సునీత(191215002389), ఎస్‌.రఘు (191215002335), ఎం.ఆదినారాయణ(191015002877), కె.లోకేష్‌నాయక్‌(191215000476), బి.ప్రియాంక(191215001345), ఎం.నాగజ్యోతి(191215002143), ఎం. అనిల్‌కుమార్‌ (191215003684).   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top