
సీఎంగా రేపే ఆఖరి రోజు: కిరణ్!
ముఖ్యమంత్రిగా రేపే ఆఖరి రోజు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా రేపే ఆఖరి రోజు అంటూ కిరణ్ కుమార్ రెడ్డి వేదాంతం మొదలుపెట్టారు. శాసనసభ వాయిదా అనంతరం ఆయన విలేకరుల ప్రశ్నకు సమాధానం ఇస్తూ సీఎంగా రేపే అఖరి రోజు అనగా...రాజీనామా చేస్తున్నారా అన్న ప్రశ్నకు అసెంబ్లీ గురువారంతో ముగుస్తుందంటూ నవ్వుతూ చెప్పారు. నేడు చుట్టీ..... రేపు చాట్ (ముచ్చట) అంటూ ముందుకు కదిలారు.
మొదటి నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కిరణ్ కొత్త పార్టీ కూడా పెడతారని వార్తలు వచ్చిన విషయం విదితమే. గత కొద్ది రోజులుగా సీఎం కిరణ్ తమ పదవికి రాజీనామా చేస్తారని, ఈరోజు, రేపంటూ వదంతులు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అటు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన రోజే ఇటు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో రాజీనామా చేయించాలని కాంగ్రెస్ అధిష్టానం యోచిస్తోంది.
ఇందుకు సంబంధించి సీఎంకు పార్టీ పెద్దలు మార్గనిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడితే రాజీనామా చేస్తానని సీఎం ఇంతకు ముందు ప్రకటన చేయడం తెలిసిందే. ఆ మేరకే ఆయన తో రాజీనామా చేయించేలా పార్టీ పెద్దలు ముందుకు వెళ్తున్నారు. ఈ మేరకే కిరణ్ పైవిధంగా వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.