నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
విశాఖపట్నం: నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడి బుధవారం నాటికి అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం తమిళనాడుపై ఉండే అవకాశం ఉంది. మరోవైపు ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడింది.
దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో అక్కడక్కడ వర్షాలుగానీ, ఉరుములతో కూడిన జల్లులుగానీ కురవవచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు సోమవారం రాత్రి ‘సాక్షి’కి తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు క్షీణిస్తున్నాయి. ఆకాశం కూడా మేఘావృతమై ఉంటోంది.