అవసరానికో.. టోల్‌ ఫ్రీ

Toll Free Numbers For Public Service - Sakshi

ఆపద, అవినీతి నిర్మూలన.. తదితర అవసరం ఏదైనా ఒక్క ఫోన్‌ కాల్‌తో సాయం పొందవచ్చు. ప్రమాదాల నుంచి రక్షణ పొందాలన్నా... తోటివారికి సాయపడాలన్నా.. సెల్‌ఫోన్‌లో బ్యాలెన్స్‌ ఉండాల్సిన అవసరం లేదు. మేలు చేయాలన్న తపన ఉంటే చాలు అత్యవసర సమయాల్లో వివిధ శాఖల సేవలను చాలా సులువుగా పొందవచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సేవలందించడంలో భాగంగా టోల్‌ఫ్రీ నంబర్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నంబర్ల గురించి ప్రత్యేక కథనం...– యల్లనూరు,అనంతపురం జిల్లా

అత్యవసర వైద్య చికిత్సల కోసం.. 108
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగినా.. ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసర వైద్య సేవల కోసం పరితపిస్తున్నా.. వెంటనే 108 నంబర్‌కు ఫోన్‌ చేయవచ్చు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేసిన వెంటనే వైద్య ఆరోగ్య సిబ్బంది క్షణాల్లో ప్రత్యేక వాహనం (అంబులెన్స్‌)లో అక్కడకు చేరుకుంటారు. క్షతగాత్రులను, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ప్రాథమిక చికిత్సలు నిర్వహిస్తూనే వాహనంలో ఆస్పత్రికి తీసుకెళతారు.  

మీ–సేవ సేవలకు - 1100
మీ–సేవ కేంద్రాల  ద్వారా అమలవుతున్న సేవలను తెలుసుకునేందుకు 1100 నంబర్‌కు డయల్‌ చేయాలి. సిబ్బంది వెంటనే సమాచారం అందిస్తారు. మీ సేవ కేంద్రాల్లో సిటిజన్‌ చార్ట్‌ ప్రకారం ఫీజులు వసులు చేయకపోయినా ఇందులో ఫిర్యాదు చేయవచ్చు. సమస్యకు వెంటనే పరిష్కారం దక్కుతుంది. మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రతి సేవలను ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి తెలపడం ద్వారా పొందవచ్చు.  

పోలీసుల సాయం కోసం.. 100
సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా.. దౌర్జన్యాలకు గురవుతున్నా.. తక్షణ పోలీసుల సాయం కోరేందుకు ఏర్పాటు చేసిందే ఈ టోల్‌ ఫ్రీ నంబరు. ప్రతి ఒక్కరికి చాలా సులువుగా గుర్తుండేలా నంబర్‌ను కేటాయించారు. సమాజంలో ఎదురయ్యే అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు, దౌర్జన్యాలను అరికట్టేందుకు సమాజ హితం కోరే ఎవరైనా ‘100’ నంబర్‌కు ఫోన్‌ చేస్తే వెంటనే పోలీసులు రంగంలోకి వచ్చేస్తారు.   

వైద్య సేవల సాయం పొందేందుకు  104
పేదలకు మెరుదైన వైద్య చికిత్సలు అందజేసేందుకు ఆరోగ్యశ్రీ పథకాన్ని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి అమలులోకి తీసుకువచ్చారు. ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి వైద్య సేవలు అందుతాయి. లేదా సంబంధిత ఆస్పత్రుల్లో అందుకున్న వైద్య సేవల్లో లోపాలు ఏమైనా ఉన్నా.. వెంటనే 104కు ఫోన్‌ చేసి సమాచారం చేరవేయవచ్చు. దీని వల్ల వెంటనే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కావాల్సిన సమాచారం కూడా వెనువెంటనే అందజేస్తారు.   

విద్యుత్‌ సమస్యలకు 1912
విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి 1800–425–55–333/1912 టోల్‌ ఫ్రీ నంబర్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. విద్యుత్‌ సరఫరాలో అంతరాయం, కొత్త విద్యుత్‌ లైన్ల ఏర్పాటు, లోవోల్టేజీ, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలు, విద్యుత్‌ శాఖ అధికారుల పనితీరు తదితర సమస్యలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు ఈ నంబర్‌ను ఉపయోగించుకోవచ్చు.  

ఆధార్‌ కార్డు కోసం..1947
ప్రస్తుతం ఆధార్‌ కార్డు లేనిదే ఏ పని జరగడం లేదు. ఆధార్‌ నంబర్‌ లేనివారు దానిని పొందడానికి, సరైన వివరాలు తెలుసుకునేందుకు ప్రత్యేకంగా టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 1947కు ఫోన్‌ చేయడం ద్వారా ఆధార్‌ కార్డు పొందడంలో ఉత్పన్నమయ్యే సమస్యలు తీరుతాయి.

ఓటర్‌ కార్డునమోదు కోసం1950
భారత రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాల్సి ఉంటుంది. అయితే ఓటరు నమోదు ఎక్కడ చేస్తారో తెలియక ఇబ్బంది పడే వారికి వెసుటుబాటు కల్పించేలా 1950 టోల్‌ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ నంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా ఓటరు కార్డు ఎలా పొందవచ్చు, నమోదుకు అవసరమైన పత్రాలు ఇతర అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తారు. సందేహాలను నివృత్తి చేస్తారు.  

రైల్వే సమాచారానికి 139
సమీప రైల్వేస్టేషన్‌ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్ల రాకపోకల సమాచారం తెలుసుకునేందుకు 139కి ఫోన్‌ చేస్తే చాలు. మనకు కావాల్సిన ప్రతి సమాచారాన్ని అందజేస్తారు. అంతేకాక రైలు ప్రయాణంలో మరుగుదొడ్ల సమస్య, నాసిరకం ఆహారం తదితర సమస్యలపై కూడా ఈ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయవచ్చు.

అవినీతి నిర్మూలనకు 1064
ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడితే వారి భరతం పట్టేందుకు 1064ను సంప్రదిస్తే చాలు. బాధితులు ఇచ్చిన సమాచారంతో వెంటనే ఏసీబీ అధికారులు అక్కడకు చేరుకుని అవినీతి అధికారుల ఆగడాలను కట్టడి చేస్తారు. అవినీతికి పాల్పడిన అధికారిని తగిన ఆధారాలతో అరెస్ట్‌ చేసి శాఖాపరమైన చర్యలు తీసుకుంటారు.  

బేటీ బచావో.... బేటీ పడావో
ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం 2015, జనవరి 22న బేటీ బచావో..బేటీ పడావో నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అమలులోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగా బాలికల చదువు, ఆర్థిక అభివృద్ధి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ పథకం గురించి తపాలా కార్యాలయంలో ఖాతా తెరవడం, విధివిధానాలు తదితర వివరాలను తెలుసుకోవాలనుకునేవారు 1800–180–1072ను సంప్రదించవచ్చు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top