ఫీజుల నియంత్రణకు ‘టోల్‌ ఫ్రీ’ నంబర్‌

Toll Free Number For AP Schools And College Fees Regulation - Sakshi

ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్‌వాడీ కేంద్రాలు

భద్రతా ప్రమాణాలు పాటించని స్కూళ్లపై చర్యలు

నిబంధనలు పట్టించుకోని కాలేజీలపై కొరడా

విద్యా శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు, కాలేజీల్లో ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్న  ఫీజుల నియంత్రణకు ‘టోల్‌ ఫ్రీ’ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులను ఆదేశించారు. భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న స్కూళ్లను అనుమతించవద్దని స్పష్టంచేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్ని ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు నిర్వహించేలా సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రైవేటు కాలేజీలు, స్కూళ్లు, ఇతర విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణపై సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం సమీక్ష నిర్వహించారు.

ఫీజులు షాక్‌ కొట్టేలా ఉన్నాయి
‘ప్రజలు మన నుంచి చాలా ఆశిస్తున్నారు. నాణ్యమైన విద్య, పాఠ్య ప్రణాళికలో నాణ్యతను కోరుకుంటున్నారు. అదే సమయంలో ఫీజులు తగ్గాలి. ఈ మూడు అంశాల్లో మార్పు రావాలి. విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయాలి. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు షాక్‌ కొట్టేలా ఉన్నాయి. ఫీజుల్ని నియంత్రించేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేయండి. నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకున్నప్పుడు ఫోకస్‌ ఎక్కడ చేయాలో సులభంగా తెలుస్తుంది’ అని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ప్రారంభం సందర్భంగా జనవరి 9న గ్రామాల్లోని స్కూళ్లలో పేరెంట్స్‌ కమిటీలు, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.  

వ్యాపారంగా మారిస్తే కఠిన చర్యలు
విద్య వ్యాపారం కాదని.. చట్టాలు, నిబంధనల్ని ఉల్లంఘించి విద్యను వ్యాపారంగా మార్చే వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. ‘విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి. పేదల పిల్లలు మంచి కాలేజీల్లో, పెద్ద విద్యాసంస్థల్లో చదువుకోవాలి. ఈ మేరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కచి్చతంగా అమలు చేస్తాం. రీయింబర్స్‌మెంట్‌ కింద ఇవ్వాల్సిన డబ్బులను ప్రభుత్వం సకాలంలో అందచేస్తుంది. అదే సమయంలో ప్రమాణాలు, నిబంధనలు పాటించని కాలేజీలపై చర్యలు చేపట్టాలి. ఉల్లంఘనలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకున్నప్పుడు వాటిని ప్రచారం చేయండి. అందువల్ల ఇతరులు ఆ తప్పులు చేయకుండా ఉంటారు. ఆటస్థలాలు లేని, అగ్ని ప్రమాదాల నివారణ ఏర్పాట్లు వంటి భద్రతా ప్రమాణాలు పాటించని స్కూళ్లను మూసివేయించాలి’ అని సీఎం సూచించారు.

ఇంగ్లిష్‌ మీడియంపై దుష్ప్రచారం
ఇంగ్లిష్‌ మీడియం చదువుల కోసం తల్లిదండ్రులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్నారు. పిల్లలకు ఇంగ్లిష్‌ మీడియంలో ఉచితంగా చదువులు చెప్పిద్దామని ప్రయత్నిస్తుంటే.. అడ్డుకునేందుకు చాలామంది అనేక రకాలుగా ప్రయన్తస్తున్నారని జగన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఇంగ్లిష్‌ మీడియంను పేదవాళ్ల దగ్గరకు తీసుకెళ్తేనే ఈ వ్యవస్థలో మార్పులు వస్తాయి. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందంటే చాలామంది తట్టుకోలేకపోతున్నారు. మద్యం దుకాణాలు, బార్లు తగ్గిస్తుంటే.. వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువులు చెప్పిస్తామంటే దానిపైనా విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసేవారి మనవళ్లు, పిల్లలు ఏ మీడియంలో చదువుకున్నారు? చదువుకుంటున్నారు?’ అని సీఎం పేర్కొన్నారు.

ఏపీని విద్యాధిక రాష్ట్రాంగా తీర్చిదిద్దాలంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని.. నాణ్యతా ప్రమాణాలు పెంచితేనే దేశంలో అగ్రస్థానంలో ఉండగలమని చెప్పారు. వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఉద్యోగులను ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు వాడుకోవాలని, టీచర్లను విద్యాబోధనకే వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల విద్య, ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ల చైర్మన్లు జస్టిస్‌ ఆర్‌.కాంతారావు, జస్టిస్‌ వి.ఈశ్వరయ్య, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి, ఉన్నత విద్లా శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సతీష్ చంద్ర, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top