ఆరు బయటకు పరుగు తీయాల్సిందే... | Toilets Shortages in Vizianagaram Government Schools | Sakshi
Sakshi News home page

ఆరు బయటకు పరుగు తీయాల్సిందే...

Nov 26 2018 4:20 PM | Updated on Jul 26 2019 6:25 PM

Toilets Shortages in Vizianagaram Government Schools - Sakshi

రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం లేక వినియోగానికి దూరంగా ఉన్న గాడీఖానా ప్రాథమిక పాఠశాల మరుగుదొడ్లు

విజయనగరం అర్బన్‌: పట్టణంలోని 39వ వార్డు పరిధిలో శాంతినగర్‌ ఉర్దూ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నారు. ఈ పాఠశాలలో నేటికీ మరుగుదొడ్లు నిర్మించలేదు. అలాగే ఆరో వార్డు పరిధిలోని హుకుంపేట ప్రాథమిక పాఠశాలలో 25 మంది విద్యార్థులు, ఇద్దరు మహిళా ఉపాధ్యాయులున్నా మరుగుదొడ్ల సౌకర్యం లేదు. మరుగుదొడ్లు నిర్మించమని పలుమార్లు అధికారులను వేడుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 102 వరకు ఉన్నాయి. మరోవైపు నిర్మించిన మరుగుదొడ్లు విద్యార్థుల సంఖ్యకు సరిపడిక... రన్నింగ్‌ వాటర్‌ సౌకర్యం లేక సుమారు 60 శాతం వరకు నిరుపయోగంగా పడి ఉన్నాయి. జిల్లాలో ఈ పరిస్థితులు చూస్తుంటే ప్రభుత్వం విద్యారంగానికి ఎంతటి ప్రాధాన్యం ఇస్తుందో అర్థంచేసుకోవచ్చు.

అత్యవసరం అయితే అంతే..
జిల్లాలో  ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 3,034 పాఠశాలలుండగా ఇప్పటికీ  మరుగుదొడ్లు నిర్మించని పాఠశాలలు 102 వరకు ఉన్నాయి. విజయనగరం పట్టణ పరిధిలోని  రెండు పాఠశాలలకు ఇప్పటికీ మరుగుదొడ్లు లేవు. ఆయా పాఠశాలలో ఆ రెండింటికీ  విద్యార్థులు ఆరు బయటకు వెళ్లాల్సిందే. ఈ ఏడాది ప్రారంభంలో ఉద్యమంలా నిర్మించిన మరుగుదొడ్ల వ్యవహారం తూతూమంత్రంగా కనిపిస్తోంది. ఆగస్టులో నిధులు వెనక్కి వెళ్లిపోవడం నిర్మాణ పనులు ఆగిపోయాయి. విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య నిర్మించడం లేదు. సీతానగరం మండలం గాదిలవలస ఉన్నత పాఠశాలలో 540 మంది విద్యార్థులుండగా ఒక్క మరుగుదొడ్డి మాత్రమే నిర్మించారు. మరోవైపు దానికి రన్నింగ్‌ వాటర్‌ సదుపాయం కల్పించలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లా వ్యాప్తంగా 60 శాతం వరకు  ఉన్నాయి.  

అమలు కాని ఆదేశాలు..
ప్రభుత్వ పాఠశాలపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ ఒలకపోస్తోంది. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా అమలు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినప్పటికీ నిర్వాహణ లోపాలను సరిదిద్దుకోవాలని ఇటీవల జిల్లాలో పర్యటించిన సుప్రీంకోర్టు బృందం సూచనలతోకూడిన ఆదేశాలిచ్చింది. అదేవిధంగా పాఠశాలల్లోని తాగునీరు, మరుగుదొడ్ల నిర్వాహణకు నెలవారీ నిధులివ్వాలని సూచించింది.  అయితే ప్రభుత్వం మాత్రం పాఠశాలలను మూసివేయడానికి చూస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో చెప్పిన మాటలు చూస్తే అనుమానాలు కలగకమానవు.నిధుల్లేక నిలిచాయి..
జిల్లాలో 43 పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించాలి. మరో వంద మరుగుదొడ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడం వల్లే పనులు ఆగాయి. త్వరలో నిధులు విడుదలవుతాయి.వెంటనే పనులు చేపడతాం.
–  డాక్టర్‌ బీ.శ్రీనివాసరావు, పీఓ, ఎస్‌ఎస్‌ఏ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement