బాబా సేవలో 5 వసంతాలు

బాబా సేవలో 5 వసంతాలు


నేడు సత్యసాయిబాబా జయంతి

 

తగరపువలస : ఇందుగలడు అందుగలడు ఎందెందు వెదికినా అందందేగలడంటూ భక్త ప్రహ్లాదుడు శ్రీహరిపై నమ్మకం ఉంచి భక్తిని చాటుకున్నాడు. అంతకాకపోయినా అలాంటి నమ్మకంతోనే తగరపువలసకు చెందిన వానపల్లి సన్యాసిరావు అనే 76 ఏళ్ల వృద్ధుడు బాబాపై నమ్మకంతో ఏభై వసంతాలుగా సేవ చేస్తూనే భక్తి మాధుర్యాన్ని చవిచూస్తున్నాడు. తగరపువలస ప్రధానరహదారిని ఆనుకుని ఉన్న సత్యనారాయణ కొండ దిగువ భాగంలో ఉన్న ఈ పురాతన మందిరాన్ని ఎందరు విడిచిపెట్టి పోయినా ఆయన మాత్రం ఎవ్వరొచ్చినా రాకున్నా భౌతికంగా బాబా లేకపోయినా మందిరంలో ఉదయం, సాయంకాల సేవలను త్యజించలేదు. బాబా జన్మనక్షత్రమైన ఆరుద్రను పురస్కరించుకుని శనివారం పురాతన మందిరంలో జయంతి వేడుకలు జరుపుతున్నారు.

 

బాబాయే రప్పించుకున్నారు..

నెల్లిమర్ల జూట్‌మిల్లులో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్న సన్యాసిరావును 1965లో చిట్టివలస జూట్‌యాజమాన్యం ఇక్కడకు రప్పించుకుంది. అప్పటినుంచే ఆయనకు బాబా మందిరానికి వెళ్లే అలవాటయ్యింది. 1970లో బాబా రాజమండ్రి వచ్చినప్పుడు ఆయన ప్రసంగాన్ని రికార్డు చేయడానికి సన్యాసిరావు వెళ్తే స్వయంగా బాబాయే ఆయన వద్ద ఆగి ఆప్యాయంగా నిమిరారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆయన దరిదాపులకు ఎలాంటి బాధలూ చేరలేదని, పైగా తన కుటుంబానికి కూడా బాబా ఆశీస్సులు లభించాయని ఆయన చెబుతారు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన మందిరం బీటలువారడంతో ఇక్కడి సభ్యులంతా చిట్టివలసలో మందిరం కట్టుకుని వెళ్లిపోయినా సన్యాసిరావు మాత్రం బాబా కొలువైన ఈ పురాతన మందిరాన్ని విడిచిపెట్టి వచ్చేదిలేదని తెగేసి చెప్పారు. హుద్‌హుద్ తుపాను ధాటికి ఎన్నో నిర్మాణాలు దెబ్బతిన్నా ఈ మందిరంలోకి వర్షపుచుక్కలు కూడా రాలేకపోయాయి.

 

బాబాపై నమ్మకమే నడిపిస్తుంది..


మందిరానికి నేను వచ్చే తొలిరోజుల్లో రంగూరి పెదరమణ, రమణమూర్తి పంతులు, గిడుగు సుబ్బారావు, జోగ అప్పలస్వామి వంటి వారు మందిరంలో వేకువజామున ఓంకారం, సుప్రభాతం, విష్ణుసహస్రనామాలు సాయంత్రం వేళల్లో ధ్యానం, భజనలు నిర్వహించేవారు. అలాంటి ఈ పవిత్రమందిరాన్ని విడిచిపెట్టడానికి మనసొప్పలేదు. ఇద్దరు, ముగ్గురు సాయంతో క్రమం తప్పకుండా ఈ క్రతువులు ఆచరిస్తూనే ఉన్నాను. బయట నుంచి ఎటువంటి చందాలు వసూలు చేయకుండానే నాకు వచ్చే పెన్షన్‌తోనే బాబాసేవతో పాటు నారాయణసేవ చేస్తున్నాను. కడ వరకు ఈ మందిరంలో బాబాసేవలోనే గడుపుతాను. రుద్రుడే సాయిరుద్రునిగా అవతరించి ఆరుద్ర నక్షత్రమున నరుని నారాయణుడిగా మార్చడానికి వచ్చినాడని నా నమ్మకం.

 - వానపల్లి సన్యాసిరావు, తగరపువలస

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top