బందరు రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న నిర్వాసితులు నష్టపరిహారం పెంచాలని ఆందోళన చేశారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసితులకు పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : బందరు రోడ్డు విస్తరణలో భూమి కోల్పోతున్న నిర్వాసితులు నష్టపరిహారం పెంచాలని ఆందోళన చేశారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వాసితులకు పరిహార చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. నిర్వాసితుల నిరసన నడుమ అధికారులు చెక్కులను పంపిణీ చేశారు.
బెంజిసర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గ్రామంలో స్థలాలు కోల్పోతున్న 101 మంది నిర్వాసితులకు పరి హారం పంపిణీ చేయడానికి సబ్‌కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈడ్పుగల్లులో 34,454.13 చదరపు మీటర్ల స్థలానికి సంబంధించి నిర్వాసితులకు అధికారులు పరిహార చెక్కులు తయారు చేశారు. కాగా చెక్కులు పంపిణీ చేయటానికి వచ్చిన సబ్‌కలెక్టర్ డి.హరిచందన వద్ద నిర్వాసితులు తక్కువ పరిహారం మంజూరు చేసి తమకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
న్యాయమైన ధర ఇచ్చేవరకు పరిహారం తీసుకునేది లేదన్నారు. 2007లో రూపొందించిన చట్టం ప్రకారం గజానికి రూ. 2,700 పరిహారం ఇవ్వటం వల్ల తాము నష్టపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త చట్టం ప్రకారం గజానికి రూ.5,500లు చెల్లించాలని డిమాండ్ చేశారు. సబ్‌కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ.. కొత్త చట్టం జాతీయ రహదారులకు వర్తించదన్నారు. ముందుగా తాము ఇచ్చిన చెక్కులను తీసుకుని అదనపు పరిహారం కోసం ప్రయత్నించాలని సూచించారు.
దీంతో ఆందోళన కారులు శాంతించి చెక్కులను తీసుకున్నారు. కొందరు నిర్వాసితులు మాత్రం తమకు చెక్కులు వద్దని వెనక్కి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో కంకిపాడు తహశీల్దార్ రోజా, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.