జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు బంద్ నిర్వహించేందుకు టీ జేఏసీ జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓస్ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతిని నిరసిస్తూ టీజేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి:
జిల్లాలో శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం రాత్రి వరకు బంద్ నిర్వహించేందుకు టీ జేఏసీ జిల్లా నేతలు సన్నద్ధమవుతున్నారు. హైదరాబాద్‌లో ఏపీ ఎన్జీఓస్ ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు అనుమతిని నిరసిస్తూ టీజేఏసీ తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చారు. జిల్లాలో బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా టీ జేఏసీ పశ్చిమ జిల్లా కమిటీ అధ్యక్షుడు వై. అశోక్ కుమార్, టీఎన్జీఓస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు టి. రాజేందర్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ వేర్వేరు ప్రకటనల్లో పిలుపునిచ్చారు. బంద్‌ను విజయవంతం చేయాల్సిందిగా వివిధ వర్గాల నుంచి మద్దతు కోరుతూ టీ జేఏసీ విజ్ఞప్తి చేసింది. ‘హైదరాబాద్‌లో సభ నిర్వహణకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి చేస్తున్న కుట్రలను ఎండగట్టేందుకు బంద్ కు పిలుపునిచ్చాం.
రాష్ట్ర ఏర్పాటుపై కసరత్తు వేగవంతమవుతున్న తరుణంలో పోలీసు యంత్రాంగాన్ని, ఏపీ ఎన్జీఓలను అడ్డుపెట్టి కుట్రలకు పాల్పడుతున్నారు. సీఎం కుట్రలను తిప్పికొట్టే శక్తి టీజేఏసీ, తెలంగాణ సమాజానికి వుందని’ అశోక్ కుమార్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అన్ని వర్గాలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆందోళనకు దిగాల్సిందిగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో సీఎం కిరణ్ సభకు అనుమతి ఇచ్చి తెలంగాణవాదుల సహనాన్ని పరీక్షిస్తున్నారని టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్. సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బంద్‌లో పాల్గొనాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మరోవైపు బంద్ పిలుపు నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.