తిరుమల కిటకిట | Tirumala Tirupati Devasthanam Devotees Full Rush | Sakshi
Sakshi News home page

తిరుమల కిటకిట

May 17 2019 7:17 AM | Updated on May 17 2019 8:46 AM

Tirumala Tirupati Devasthanam Devotees Full Rush - Sakshi

తిరుమల ఆలయం వద్ద భక్తుల సందడి

తిరుమల/తిరుపతి తుడా: ఇల వైకుంఠం.. తిరుమల క్షేత్రానికి వేసవి సెలవులతో భక్తులు పోటెత్తుతున్నారు. ఏడుకొండలవాడి దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తుండటంతో తిరుమల కొండ నిత్యం కిటకిటలాడుతోంది. ఈనెల 11 నుండి 15వ తేదీ వరకు రికార్డు స్థాయిలో దాదాపు 4.39 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, నిర్ణీత సమయంలో స్వామివారిని దర్శించుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఆదేశాల మేరకు తిరుమల ఇన్‌చార్జ్‌ జేఈవో బి.లక్ష్మీకాంతం పర్యవేక్షణలో అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సమన్వయంతో పనిచేసి ఈ ఏడాదిలోనే రికార్డు స్థాయిలో
గత ఐదు రోజుల్లో 4,38,514 మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించారు.

11వ తేదీ శనివారం 95,016, 12వ తేదీ ఆదివారం 1,01,086, 13వ తేదీ సోమవారం 87,947, 14వ తేదీ మంగళవారం 80,156, 15వ తేదీ బుధవారం 74,309 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. సరాసరిన ప్రతి రోజు 87,702 మంది దేవదేవుడి దర్శనభాగ్యాన్ని పొందారు. తిరుమలకు విచ్చేసిన భక్తులందరికీ అన్న ప్రసాదాలు, వసతి, తలనీలాల సమర్పణ, దర్శనం, లడ్డూ ప్రసాదాలు తదితర సౌకర్యాలను కల్పించేందుకు ఆయా విభాగాలు విశేషంగా కృషి చేశాయి. రవాణా విభాగం ఆధ్వర్యంలో ధర్మరథాలు నిరంతరం తిరుగుతూ భక్తులకు ఇబ్బంది లేకుండా చూసింది.

సమన్వయంతో సేవలు: జేఈఓ
వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ 1, 2, నారాయణగిరి ఉద్యానవనాల్లో క్యూల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి సేవలందించాయని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు శ్రీవారి ఆలయ అధికారులు, సిబ్బంది క్యూలను క్రమబద్ధీకరించారన్నారు. తలనీలాలు సమర్పించేందుకు భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా ప్రధాన కల్యాణకట్ట, మినీ కల్యాణకట్టల్లో ఆదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి 24 గంటలు సేవలు అందించేలా చర్యలు చేపట్టామని తెలిపారు. తిరుమలలో బస కల్పించేందుకు విశ్రాంతి భవనాల్లో గదుల వివరాలను ఎప్పటికప్పుడు టీటీడీ రేడియో, బ్రాడ్‌కాస్టింగ్‌ ద్వారా భక్తులకు తెలియచేస్తున్నామని చెప్పారు. భక్తులకు అవసరమైనన్ని లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

నారాయణగిరి ఉద్యానవనాల్లోని సర్వదర్శనం, దివ్యదర్శనం క్యూలైన్‌లు, వైకుంఠం – 1, 2 కంపార్టుమెంట్లలో భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ, చిన్నపిల్లలకు పాలను శ్రీవారి సేవకుల ద్వారా నిరంతరం పంపిణీ చేసినట్లు జేఈఓ తెలిపారు. శ్రీవారి సేవకులు క్యూల నిర్వహణ, లడ్డూ ప్రసాదాల పంపిణీ, పరకామణి తదితర విభాగాల్లో సేవలందిస్తున్నారన్నారు. యాత్రికుల సంక్షేమ సౌకర్యాల సేవకులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ భక్తులకు అందుతున్న సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులకు సమాచారం అందించి సత్వరం పరిష్కారమయ్యేలా సేవలందించారని తెలిపారు. తిరుమలలో మెరుగైన పారిశుద్ధ్యం కోసం ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. టీటీడీ ఇంజినీరింగ్, నిఘా, భద్రతా సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేసి పటిష్టమైన భద్రత కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారన్నారు.
 
తిరుమలలో రేపు పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.

తలనీలాల వేలం ద్వారా రూ.1.25 కోట్ల ఆదాయం
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి భక్తులు సమర్పించిన తలనీలాల ఈ–వేలం ద్వారా టీటీడీకి రూ.1.25 కోట్ల ఆదాయం సమకూరింది. టీటీడీ గురువారం నిర్వహించిన ఈ–వేలంలో మొత్తం 600 కిలోల తలనీలాలను విక్రయించింది. మొదటి రకం (31 ఇంచుల పైన) తలనీలాలు కిలో రూ.22,502 ధరతో 2,500 కిలోలను వేలానికి ఉంచగా 400 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. రెండో రకం (16 నుండి 30 ఇంచులు) తలనీలాలు కిలో రూ.17,260 ధరతో 27,600 కిలోలను వేలానికి ఉంచగా 200 కిలోలు అమ్ముడుపోయాయి. తద్వారా రూ.34.52 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.

కొనసాగుతున్న రద్దీ
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ కొనసాగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. భక్తులు బుధవారం శ్రీవారి హుండీకి సమర్పించిన కానుకలను గురువారం లెక్కించగా రూ.4.10 కోట్ల ఆదాయం వచ్చినట్టు అధికారులు తెలిపారు.

రేపు పౌర్ణమి గరుడసేవ
తిరుమలలో శనివారం పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement