ఆగని అక్రమ రవాణా

Timber Illegal Transport In Kadapa - Sakshi

మల్లెంకొండలో యథేచ్ఛగా ఎర్రచందనం చెట్ల నరికివేత

అడ్డదారులు వెతుకుంటున్న స్మగ్లర్లు

అటవీశాఖ అధికారులఅదుపులో తమిళ కూలీలు

సాక్షి, గోపవరం: గోపవరం మండలం మల్లెంకొండ పరిసరాలలో యథేచ్ఛగా ఎర్రచంనదం చెట్లను నరికి అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. స్మగ్లర్లు అటవిశాఖాధికారుల కళ్లు గప్పి చెట్లను నరికి అటవీ ప్రాంతం నుంచి దుంగలను సురక్షిత ప్రాంతానికి చేర్చుకుని అక్కడ నుంచి రవాణా చేస్తున్నారు. మండలంలో సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల కింద దాదాపు 35 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. వెనుక జలాలకు ఇరువైపులా అటవీ ప్రాÆతం ఉంది. మల్లెంకొండ పరిసరాలను పెనుశిల అభయారణ్యం అని కూడా పిలుస్తారు.

ఈ ప్రాంతంలో అధికంగా ఎర్రచందనం, ఇతర అటవీ సంపద ఉంది. సోమశిల వెనుక జలాల ముసుగులో స్మగ్లర్లు , ఎర్ర చందనం నరికి రవాణా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మల్లెంకొండ మంచినీరు సెల, విశ్వనాథ పురం, సూరేపల్లె కూడలిలో ఎర్రచందనం నరికి దుంగలను తరలించారు. మరికొన్ని దుంగలు అక్కడే ఉన్నాయి. చెట్లు నరికిన మొదళ్లు, దుంగలను చూస్తే నాలుగైదు రోజుల క్రితమే స్మగ్లర్లు చెట్లను నరికినట్లు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మండలంలోని పీపీకుంట జాతీయ రహదారిపై అటవిశాఖ చెక్‌పోస్టు ఉంది. అలాగే ఎస్‌.రామాపురం వద్ద బేస్‌క్యాంపు ఏర్పాటు చేశారు. నరికిన ఎర్ర చందనం దుంగలను ఈ రెండు చెక్‌పోస్టుల ద్వారా సిబ్బంది కళ్లుగప్పి తరలిస్తున్నారా లేక మల్లెంకొండనుంచి తూర్పు భాగానికి వెళితే కాలినడకన  నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాయుడుపల్లె వద్దకు వెళ్లే అవకాశం ఉంది.  

అయితే నరికిన దుంగలను కూలీలు కాలినడకన కొండ దిగువ వరకు తీసుకెళ్లిన దాఖలాలు గతంలో ఉన్నాయి. అక్కడి నుంచి అతి దగ్గరగా నెల్లూరు –ముంబయి జాతీయ రహదారి ఉంది. స్మగ్లర్లు ఈ మార్గాన్నే ఎంచుకుని  అటవి సంపదను కొల్లగొడుతున్నారనే సమాచారం అధికారుల వద్ద ఉంది. కాగా ఎర్రచందనం నరికి వేత , అక్రమ రవాణా పై అటవిశాఖాధికారులు , పోలీసులు  కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ  స్మగ్లర్ల భరితెగింపు ఏ మేరకు ఉందో చెప్పకనే తెలిసిపోతుంది. కాగా ఎర్రచందనం నరికివేతకు  తమిళనాడుకు చెందిన కూలీలనే  ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సమాచారం.

అటవీశాఖ అధికారుల అదుపులో తమిళ కూలీలు 
మండలంలోని పీపీకుంట చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి 9 మంది తమిళ కూలీలను చెక్‌పోస్టు సిబ్బంది పట్టుకుని అధికారులకు అప్పగించారు. బద్వేలు నుంచి¯ð నెల్లూరు వైపు కారులో తమిళ కూలీలు వెళుతున్నారన్న సమాచారం తెలుసుకుని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మల్లెంకొండలో ఎర్రచందనం చెట్ల నరికివేతపై బద్వేలు అటవీశాఖ రేంజర్‌ పి.సుభాష్‌ను సాక్షి వివరణ కోరగా తమకు కూడా సమాచారం అందిందని ఆదివారం ఉదయం సిబ్బందిని మల్లెంకొండ ప్రాంతానికి పంపించామన్నారు. ఇప్పటికే కొంతమంది తమిళ కూలీలను అదుపులోకి తీసుకుని విచారిసున్నట్లు  తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top