హెచ్చరికలు పట్టించుకోక.. మృత్యువాత

Three Men Died in Godavari Tour - Sakshi

ప్రమాదకరంగా గోదావరి తీరం వెంబడి ఊబి నేలలు

హెచ్చరిక బోర్డులను బేఖాతరు చేస్తున్న సందర్శకులు

పశ్చిమగోదావరి, పెరవలి: గోదావరి అందాలను తిలకించటానికి వచ్చిన సందర్శకులు అందులో స్నానం చేసేందుకు నీటిలోకి దిగి ప్రమాదాల బారిన పడుతున్నారు. ప్రతి ఏడాది  విహారయాత్రకు వచ్చే సందర్శకులతో గోదావరి తీరం కళకళలాడుతూ ఉంటుంది. అదే సమయంలో గోదావరిలో స్నానానికి దిగి ప్రమాదాలబారిన పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి.
∙2011లో కాకరపర్రు వద్దకు విహారయాత్రకు వచ్చిన విద్యార్థులు స్నానం చేస్తూ నీటమునిగి ఏడుగురు మృతిచెందారు.  2017లో ముగ్గురు స్నానాలకు దిగి మృతి చెందారు. ప్రతి ఏడాది ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి.  అధికారులు  ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయటమే కాకుండా కార్తీక మాసంలో పహరా కాస్తూ ఉంటారు. సందర్శకులు ప్రమాదం అని తెలిసినా దిగి ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ నెల 16న  ముగ్గురు యువకులు మునిగి మృతిచెందారు. ఇక్కడ ఇసుక తిన్నెలు ఎక్కువగా ఉండటం, అవతల ఒడ్డుకు వెళ్లడానికి గోదావరి తక్కువుగా ఉండటంతో స్నానం చేయటానికి అనువుగా ఉంటుందని తొందరలో గోదావరిలోకి దిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ గోదావరి ఎంతో లోతు లేనట్టు కనిపిస్తున్నా సుడిగుండాల వల్ల ఏర్పడిన గోతుల్లో పడి మృత్యువాత పడుతున్నారు. నాలుగేళ్లుగా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా రెవెన్యూ, పంచాయతీ, పోలీస్‌ శాఖలు సమన్వయంతో అధికారులు కార్తీక మాసం నెల రోజులు గోదావరి పొడవునా డ్యూటీలు నిర్వహించారు. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. లంకకు పక్కనే ఇసుక తిన్నెలకు బదులు ఒండ్రునేలలు ఏర్పడి బురదగా ఉంటాయి. ఇవి ఊబిగా మారాయని, ఇవి చాలా ప్రమాదమని లంకరైతులు చెబుతున్నారు. మండలంలో కానూరు అగ్రహారం నుంచి కడింపాడు వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర గోదావరి విస్తరించి ఉన్నా పిక్నిక్‌లకు అనువైన ప్రదేశాలు తీపర్రు, కాకరపర్రు అని చెప్పవచ్చు. ఈప్రాంతంలో ఆహ్లాదపరిచే వాతావరణంతో పాటు పచ్చని పచ్చికబయళ్లు, గోదావరి నది దగ్గరగా ఉండటం ఆడుకోవడానికి ఇసుకతిప్పలు, నీడనివ్వడానికి కొబ్బరి, అరటి తోటలు ఉన్నాయి. చల్లని గాలితో బహిరంగ ప్రదేశాలతో ఉండే ఈప్రాంతానికి జనం తండోపతండాలుగా వచ్చి ఎంతో ఆనందంతో గడుపుతూ ఉంటారు.  ఇంత ఆహ్లాదపరిచే ఈ సుందర ప్రదేశాలలో ప్రమాదాలు కూడా పొంచిఉన్నాయి. ఈఏడాది గోదావరికి 5 సార్లు వరదలు రావడంతో తీరం వెంబడి ఎక్కడికక్కడ ఒండ్రునేలలు ఏర్పడి ఇవి ఊబిగా తయారయ్యాయి. హెచ్చరిక బోర్డులను ఏర్పాటుచేసినా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదాలు పడకుండా జరగకుండా పోలీసు, రెవెన్యూ, పంచాయితీ శాఖలు పర్యవేక్షణ చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top