మూడు ముళ్లు.. మూడు తేదీలు

These Three Months Will Be Break For Good Works - Sakshi

సాక్షి, నరసన్నపేట : మూఢం ముంచుకొస్తోంది. వివాహాది శుభకార్యాలు జరుపుకునే వారికి మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ ముహూర్తాల్లోనే వివాహాలు, ఇతర శుభకార్యాలు జరుపుకొనేందుకు ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వివాహాలు అధికంగా జరుగుతున్నాయి. కల్యాణ మండపాలు ఖాళీ లేవు. శుభకార్యక్రమాలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ బిజీగా ఉన్నారు. మార్చి నుంచి వివాహాలు, ఇతర శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి. ఈ నెల 27 వతేదీ చివరి ముహూర్తం. ఆ తర్వాత శుక్ర మూఢం కారణంగా మరో మూడు నెలల పాటు పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, ఇతర శుభకార్యక్రమాలకు బ్రేక్‌ పడనుంది.

ఈనెల  25, 26, 27 తేదీల్లో ఉన్న ముహూర్తాల్లో శుభకార్యాలు చేసుకోలేని వారు ఆశ్వయుజ మాసమైన అక్టోబర్‌ 2 వరకూ వేచి ఉండాల్సిందే. ఈ మూఢమి కాలం ముగిసే వరకూ పెళ్లి వారితో పాటు పురోహితులు, కేటరింగ్, పూలు, మండపాలు డెకరేషన్‌ చేసేవారూ, కల్యాణ మండపాల యజమానులు నిరీక్షించక తప్పదు. మరో మూడు నెలలు శుభ కార్యాక్రమాలకు ముహూర్తాలు లేక పోవడంతో శుభకార్యాలుఈ నెల 27 లోగా ముగించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అంతటా హడావుడి నెలకొంది. వస్త్ర, బంగారు దుకాణాల్లో రద్దీ నెలకొంది. మండపాల డెకరేషన్, పురోహితులు బిజీబిజీగా కనిపిస్తున్నారు.

శ్రావణ మాసంలోనూ శూన్యమే
జూలై నెల ఆషాఢం కావడంతో అది శూన్యమా సం. ఆ తర్వాత వచ్చేది ఆగస్టు (శ్రావణమాసం) లో ఏటా వివాహాది శుభ కార్యక్రమాలకు మంచి ముహూర్తాలు గతంలో ఉండేవి. ఈ ఏడాది శ్రావణ మాసంలో కూడా మూఢం వచ్చి చేరింది. అలాగే సెప్టెంబర్‌ (భాద్రపద మాసం) కూడా శూన్యమాసమైంది. దీంతో వరుసగా ఈ మూడు నెలలు శుభకార్యక్రమాలకు బ్రేక్‌ పడనుంది. తిరిగి అక్టోబర్‌ 2 నుంచి శుభ ముహూర్తాలు ఉన్నట్లు సత్యవరాగ్రహరానికి చెందిన ప్రముఖ పురో హితులు జోష్యుల సంజీవ శర్మ, ఆకేళ్ల సుబ్రహ్మణ్యంలు తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top