చరిత్రకు ఆనవాళ్లు.. ఈ శివాలయాలు

These shiva temples are the landmarks of history - Sakshi

గత వైభవం కోల్పోతున్నఆలయాలు

పునరుద్ధరణపై దృష్టి పెట్టని ప్రభుత్వం

సాక్షి, కుక్కునూరు: కుక్కునూరు మండలాల్లోని శివాలయాలు గత చరిత్రకు అనవాళ్లుగా నిలుస్తున్నాయి. ఎంతో మహిమాన్వితమైన శివాలయాలుగా పేరున్నా, ప్రభుత్వాలు ఈ ఆలయాలని పట్టించుకోక పోవడంతో వాటి చరిత్ర కనుమరుగయ్యే స్థితికి చేరుకుందని భక్తజనం ఆరోపిస్తున్నారు. సమరసతా సేవా ఫౌండేషన్‌ వంటి ధార్మిక సంస్థలు ఆలయాల పునరుద్ధరణకు పూనుకుని వాటికి గత వైభవాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పూర్తి వైభవాన్ని సంతరించుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. 

మనిషి రూపంలో దర్శనమిచ్చే కేదారేశ్వరుడు


మనిషి రూపంలో ఉన్న కేదారేశ్వరస్వామి విగ్రహం

కుక్కునూరు మండలంలోని పెద్దరావిగూడెం గ్రామంలోని శ్రీకేథారేశ్వరస్వామి ఆలయానిది. 16వ శతాబ్ద కాలానిదిగా ఆలయ అర్చకులు చెప్తారు. సాదారణంగా దేశంలోని అన్ని శైవక్షేత్రాల్లో శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు కానీ మండలంలోని పెద్దరావిగూడెం గుట్ట మీద ఉన్న శివుడి విగ్రహం మాత్రం మనిషి రూపంలో ఉంటుంది. స్వామి వారి విగ్రహం ఉదయం బాలుడిగాను, మధ్యాహ్నం యవ్వనస్తుడిలా, సాయంత్రం వృద్ధుడిలా విగ్రహం కనపడడం ఇక్కడి ప్రత్యేకత. ఆ గుట్టపై స్వామి వారి విగ్రహం ఉన్న విషయాన్ని ఓ సన్యాసికి స్వామి కలలో కనిపించి చెప్పడంతో ఆయన ఊరి పెద్దలతో కలిసి తవ్వించగా విగ్రహం బయట పడినట్టు ఆలయ చరిత్రగా గ్రామస్తులు చెబుతారు. 

కౌండిన్య మహాబుషి పేరుతో వెలిసిన ఆలయం


రాతి కట్టడాలతో నిర్మించిన కౌండిన్య ముక్తేశ్వరస్వామి ఆలయం

మండలంలోని మాధవరంలోని కౌండిన్య ముక్తేశ్వరాలయం సాక్ష్యాత్తూ కౌండిన్య మహాబుషి తపస్సు చేసి ఈ ఆలయాన్ని ప్రతిష్టించినట్టు చెప్తారు. దీంతోనే  ఈ ఆలయానికి కౌండిన్యముక్తేశ్వరాలయం అని పేరొచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఆలయ పూర్తి చరిత్ర తెలిసిన వారు ఎవరూ లేనప్పటికీ ఇటీవల ఈ ఆలయాన్ని సందర్శించిన పురావస్తు శాఖ వారు మాత్రం ఈ ఆలయం కాకతీయుల నాటిదని తేల్చారు. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు గుప్తనిధుల వేటలో దుండగులు ఆలయాన్ని ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ తవ్వకాల్లో పురాతన శివలింగం బయటపడింది. కుక్కునూరు మండలంలోని శ్రీకేథారేశ్వరస్వామి, కౌండిన్యముక్తేశ్వరస్వామి ఆలయాలతో పాటు వేలేరుపాడు మండలం రుద్రమకోట, కట్కూరు శివాలయాలన్ని గుట్టల మీద ఉండడంతో పాటు అన్ని గోదావరి తీరానే ఉండడం మరో విశేషం. ముంపు మండలాల్లోని ఆలయాలను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు. 
 
 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top