జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాలను
పోలాకి: జిల్లాలో థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా జపాన్‌కు చెందిన సుమితొమొ సంస్థ ప్రతినిధులు జిల్లాలోని పలు ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. పోలాకిలోని తోటాడ గ్రామం వద్ద ప్రతిపాదిత స్థలాన్ని బుధవారం పరిశీలించనున్నారు. ఇందులో భాగంగా జెన్‌కో అధికారులు తోటాడ గ్రామానికి చేరుకుని భూముల వివరాలపై ఆరా తీశారు. ఇక్కడ నుంచి రైల్వేస్టేషన్, సముద్రతీరం, జాతీయ రహదారికి గల దూరాలను అంచనా వేశారు. భూముల పరిశీలనకు వచ్చిన వారిలో ఏపీ జెన్‌కో సంస్థ ఈఈ కె.సూర్యనారాయణ, కన్సల్టెన్సీ ప్రతినిధి ఎం.మనోహర్, తహశీల్దార్ జె.రామారావు, ఆర్‌ఐలు అనిల్‌కుమార్, బాలకృష్ణ, మండల సర్వేయర్లు ఉన్నారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయంలో మండల సలహాదారు తమ్మినేని భూషణరావుతో సదరు అధికారులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెన్‌కో ఈఈ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇక్కడ ప్లాంట్ నిర్మాణానికి అనుకూలతలను జాపాన్ బృందం పరిశీలించనుందన్నారు. ఇది ప్రాథమిక పరిశీలన మాత్రమేనని, సాంకేతిక నిపుణుల పరిశీలన మేరకు అనుకూలమైతే తుదినిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అధికారులు గుర్తించిన భూములు వివరాలు ఇవే..
మండలలోని గత వారం రోజులుగా ప్లాంట్ కోసం రెవెన్యూ అధికారులు కసరత్తు చేసి తోటాడ పరిసర గ్రామాల్లో 2227.620 ఎకరాల భూములు గుర్తించారు. ఇందులో 1050 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా మిగిలినది అక్కడి రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఈ భూములు చీడివలసలో472 ఎకరాలు, యాట్లబసివలస-138, కొండలక్కివలస-407, ఓదిపాడు-605, కుసుమపోలవలస-25, ధీర్ఘాశి-204, తోటాడ-336, చెల్లాయివలస గ్రామ పరిధిలో 338 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు.