తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు.
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్ : తిరుపతి-కాచిగూడ మధ్య కొత్తగా ఏర్పాటు చేసిన డబుల్ డెక్కర్ రైలును గురువారం ఉదయం ప్రారంభించారు. ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే సిబ్బంది చేత ఉదయం 5:45 గంటలకు రైలును ప్రారంభించారు. అనంతరం స్థానిక లైజాన్ ఆఫీసర్ కుప్పాల సత్యనారాయణ మాట్లాడుతూ 2014 రైల్వే బడ్జెట్‌లో ప్రకటించిన డబుల్ డెక్కర్ రైలును తిరుపతి నుంచి నడపడం జిల్లా వాసులకే కాకుండా రాయలసీమ జిల్లాల ప్రజలకు ఎంతో సౌకర్యవంతం అన్నారు.
ఈ రైలులో మూడు అంచెల కుషన్ సీట్లు, ఫుల్ ఏసీ సౌకర్యం ఉంటుందన్నారు. ఈ రైలు ప్రతి గురు, ఆదివారాల్లో తిరుపతి నుంచి కాచిగూడ వెళ్తుందని లైజాన్ ఆఫీసర్ తెలిపారు. కాగా గురువారం తొలిరోజు ఈ రైలులో గుంతకల్ సీనియర్ డీసీఎం స్వామినాయక్, ఇతర ఇంజనీరింగ్ అధికారులు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో ఈనెల చివరలో రిటైర్డ్ అవుతున్న రైల్వే టీటీఐలు మోహన్‌రావు, మహబూబ్ బాషా, సిరాజ్, గార్డు వరప్రసాద్, కలాసీ చిన్నబ్బ, టెక్నీషియన్ అంజనయ్యతో పాటు చీఫ్ రిజర్వేషన్ ఇన్‌స్పెక్టర్ దాసరి రాధాకృష్ణ, స్టేషన్ మేనేజర్ మాదిన గంగులప్ప, సీడీవో రామ్మోహన్, సీనియర్ సెక్షన్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు, ఏఈ కృపానంద్, స్క్వాడ్ ఇన్‌స్పెక్టర్లు టీవీ రావు, వేణుమాధవ్, రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ సెక్రటరీ కుప్పాల గిరిధర్‌కుమార్ పాల్గొన్నారు.