అదే అయోమయం | The same confused | Sakshi
Sakshi News home page

అదే అయోమయం

Dec 12 2014 1:44 AM | Updated on Jun 4 2019 5:04 PM

పంట రుణాలకు అసలు అర్థమేంటో చెప్పండి..’ తోట్లవల్లూరు సదస్సులో వెల్లూరు బ్రహ్మం అనే రైతు అధికారులను అడిగిన ప్రశ్న ఇది.

రైతు సాధికారత సదస్సుల్లోనూ రుణమాఫీపై కొరవడిన స్పష్టత
రైతుల ప్రశ్నలకు అధికారుల దాటవేత ధోరణి
రెండో జాబితా పేరుతో తప్పించుకునే యత్నం
మాఫీ పత్రాలూ కొందరికే అందజేత


‘పంట రుణాలకు అసలు అర్థమేంటో చెప్పండి..’  తోట్లవల్లూరు సదస్సులో వెల్లూరు బ్రహ్మం అనే రైతు అధికారులను అడిగిన ప్రశ్న ఇది. తమ ప్రాంతంలో అరటి, పసుపు, కంద పంటలపై తీసుకున్న రుణాలు మాఫీ కాలేదని ఆయన అధికారుల దృష్టికి తెచ్చారు. దీనిపై వారు స్పందిస్తూ.. ప్రభుత్వ నిబంధనల మేరకు వరి, చెరకు పంటలకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఎంత అయోమయంగా జరిగిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
 
మచిలీపట్నం : రుణవిమోచన పత్రాలు అందజేసేందుకు ప్రభుత్వం గురువారం ఏర్పాటు చేసిన రైతు సాధికారత సమావేశాల్లోనూ రుణమాఫీపై స్పష్టత కొరవడింది. అన్ని ఆధారాలూ సమర్పించినా రుణమాఫీ జాబితాలో తమ పేరు లేదని పలువురు రైతులు పేర్కొనగా.. ప్రభుత్వం విధించిన నిబంధనల ఆధారంగానే రుణమాఫీ జరిగిందని, ఇంతకుమించి తమకేమీ తెలియదని పలువురు బ్యాంకు అధికారులు సమాధానమిచ్చారు. మరిన్ని వివరాలు కావాలంటే ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకోవాలని తప్పించుకునే ప్రయత్నం చేశారు. పలువురు అధికారులు మాత్రం మొదటి జాబితాలో పేర్లు రానివారికి రెండో జాబితాలో వస్తుందంటూ సమాధానమిచ్చారు. మొదటి జాబితాలో పేర్లు లేని రైతులు గట్టిగా ప్రశ్నిస్తే రెండో జాబితాలో లేకుండా చేస్తారనే భయంతో మిన్నకుండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. గురువారం ఆకాశం  మేఘావృతమై ఉండి చిరుజల్లులు కురవడం, పంటలను కాపాడుకునేందుకు అన్నదాతలు అధిక శాతం పొలం పనుల్లో నిమగ్నమై ఉండ టంతో రైతుల హాజరు అంతంతమాత్రంగానే ఉంది. రూ.50 వేల లోపు రుణం ఉన్న రైతులకు రుణవిమోచన పత్రాల అందజేత కూడా మొక్కుబడిగానే సాగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో గురువారం జరిగిన సదస్సుల్లో

చోటుచేసుకున్న ఘటనల వివరాలివీ..

ముదినేపల్లి మండలం బొమ్మినంపాడులో ఓ రైతు తాను పంట రుణంగా రూ.40 వేలు తీసుకున్నానని, వడ్డీతో కలిపి రూ.51 వేలు అయిందని, రుణం మొత్తం రూ.50 వేలు దాటిందంటూ తన పేరుతో ఉన్న రుణమాఫీ జరగలేదని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. వడ్డీతో కలిపి రూ.50 వేలు దాటినా.. విడతలవారీగా మాఫీ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు.
  మైలవరం మండలం చంద్రాల సొసైటీలో రూ.50 వేల లోపు రుణమాఫీ వర్తించినవారు 150 మంది ఉండగా, పది మందికి మాత్రమే రుణవిమోచన పత్రాలు అందజేసి అధికారులు వెళ్లిపోయారు.

 కృత్తివెన్ను మండలం నీలిపూడిలో రుణమాఫీ పత్రాలు లేకుండా అధికారులు సమావేశాలు నిర్వహించారు. రైతులు దీనిపై ప్రశ్నించగా రుణవిమోచన పత్రాలు డౌన్‌లోడ్ చేస్తున్నామని, త్వరలో అందజేస్తామని చెప్పి కార్యక్రమాన్ని ముగించారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ మొత్తం చేస్తామని ప్రకటించి.. అధికారంలోకొచ్చాక రూ.50 వేల లోపు వారికి మాత్రమే చేస్తున్నట్లు పేర్కొన్నారని.. అసలు మాఫీ చేస్తారా లేదా అని పెడన మండలం బల్లిపర్రు సదస్సులో పలువురు రైతులు అధికారులను నిలదీశారు. రూ.50 వేలకు కన్నా అధికంగా పంట రుణం తీసుకున్న రైతులకు రుణవిమోచన పత్రాలు ఇవ్వకపోవడంతో వారు అయోమయానికి గురయ్యారు.

మొదటి విడత రుణమాఫీ జాబితా ఏకపక్షంగా తయారుచేశారని, ఒక వర్గానికే మాఫీ జరిగినట్లుగా ఉందని, మిగిలిన రైతులకు ఎప్పటిలోగా వర్తింపచేస్తారని కంకిపాడు మండలం జగన్నాధపురం సదస్సులో పలువురు రైతులు జేసీ జె.మురళిని ప్రశ్నించారు. పెనుగంచిప్రోలు మండలం తోటచర్లలో గుమ్మడి వెంకటేశ్వరరావు అనే రైతు మాట్లాడుతూ తాను పంట రుణంగా రూ.10 వేలు తీసుకున్నానని, రుణమాఫీగా రూ. 2 వేలే జమ చేశారని అధికారుల దృష్టికి తెచ్చారు.

నందిగామ మండలం కేతవీరునిపాడు తదితర గ్రామాల్లో అన్ని అర్హతలూ ఉన్నా కొంతమంది రైతులకు రుణమాఫీ జరగలేదని, వారి పరిస్థితి ఏమిటని రైతులు అధికారులను ప్రశ్నించారు. రెండో జాబితాలో అర్హుల పేర్లను చేరుస్తామని, అన్ని ఆధారాలూ సమర్పించాలని అధికారులు సమాధానమిచ్చారు.ధృవీకరణ పత్రాలు ఇచ్చినా తమ రుణాలు రద్దు కాలేదని, మాఫీ విధానం ఎలా జరిగిందని పెనుగంచిప్రోలు మండలం లింగగూడెం సదస్సులో పలువురు రైతులు అధికారులను ప్రశ్నించారు. వారు సరైన సమాధానం చెప్పకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement