హోరెత్తిన భద్రాద్రి | the movement to keep bhadrachalam division in telangana | Sakshi
Sakshi News home page

హోరెత్తిన భద్రాద్రి

Nov 29 2013 6:17 AM | Updated on Jul 29 2019 5:31 PM

భద్రాచలం డివిజన్ పరీరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 19వ రోజు గురువారం నాటి దీక్షల్లో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆసీనులయ్యారు.

భద్రాచలం, న్యూస్‌లైన్:  భద్రాచలం డివిజన్ పరీరక్షణ ఉద్యమం కొనసాగుతోంది. టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన 19వ రోజు గురువారం నాటి దీక్షల్లో వివిధ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ఆసీనులయ్యారు. తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి సభ్యులు దీక్షా శిబిరం వద్ద చక్రం సహాయంతో కుండలు తయారు చేశారు. దీక్షలను టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్కే గౌసుద్దీన్ ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు కోసం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. భద్రాచలం డివిజన్‌లోని ఏ ఒక్క గ్రామాన్ని కూడా వదులుకునేది లేదన్నారు. చేతివృత్తిదారులు మనుగడ సాధించాలంటే తెలంగాణలోనే భద్రాచలం ఉండాలని తెలంగాణ కుమ్మరి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్ పేర్కొన్నారు.

భద్రాచలం ప్రాంతం విషయంలో తేడావస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు మల్లెల రామనాథం, కుమ్మరి సంఘం నాయకులు రవికుమార్, నవీన్, గంగాధర్, సతీష్, మణుగూరు మండల అధ్యక్షులు సిరికొండ వెంకట్రావు, చంద్రయ్య, బీజేపీ జిల్లా కార్యదర్శి ఆవుల సుబ్బారావు, గెజిటెడ్ ఉద్యోగుల సంఘం డివిజన్ అధ్యక్షులు కె. సీతారాములు, కెచ్చెల కల్పన, ఏపీటీఎఫ్ మహిళా విభాగం అధ్యక్షులు పి.రవికుమారి, దాసరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
 రెండోరోజుకు
 సీపీఎం ప్రజాసంఘాల దీక్షలు
 భద్రాచలాన్ని ఖమ్మం జిల్లాలోనే ఉంచాలనే డిమాండ్‌తో సీపీఎం అనుబంధ ప్రజాసంఘాలు చేపట్టిన దీక్షలు రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు వివిధ ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం ప్రకటించారు. గురువారం నాటి దీక్షలను బార్ అసోసియేషన్ స్థానిక అధ్యక్షులు కృష్ణమాచారి ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసమే భద్రాచలం ప్రాంతాన్ని ఆంధ్రలో కలపాలనే కుట్రలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో గడ్డం స్వామి, లక్ష్మి, సక్కుబాయి, రాజ, బ్రహ్మచారి, శేషావతారం, పద్మ, లీలావతి, జీఎస్ శంకర్‌రావు, బండారు శరత్, రఘుపతి పాల్గొన్నారు.
 పోలవరం ప్రాజెక్టును నిలిపివేయాలి
 భద్రాచలం ప్రాంత గిరిజనులను ముంచే పోలవరం ప్రాజెక్టును వెంటనే నిలిపివేయాలని పొలిటికల్ జేఏసీ డివిజన్ కన్వీనర్ పూనెం వీరభద్రం కోరారు. ఆదివాసీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నాల్గో రోజు  దీక్షలను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. భద్రాచలం ప్రాంతాన్ని తెలంగాణలోనే కొనసాగిస్తూ ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
 కొత్త రాష్ట్రంలో కూడా ఆదివాసీల హక్కుల పరిరక్షణ, గిరిజన చట్టాల అమలకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీక్షల్లో ఉపాధ్యాయులు ఉమాకిషోర్, కాక రామకృష్ణ, సోడె  మల్లేష్, మచ్చ రమేష్, రాజేష్, పర్శిక రాజు, చంటి కూర్చొన్నారు. దీక్షలకు పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement