మావోయిస్టుల పేరిట ముగ్గురి హత్యకు కుట్ర | The Maoists called the three murder conspiracy | Sakshi
Sakshi News home page

మావోయిస్టుల పేరిట ముగ్గురి హత్యకు కుట్ర

Sep 16 2013 4:43 AM | Updated on Oct 16 2018 2:39 PM

సిరిసిల్ల ప్రాంతంలో ముగ్గురిని హతమార్చి మావోయిస్టు పార్టీని పునర్నిర్మించేందుకు కొందరు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

 సిరిసిల్ల, న్యూస్‌లైన్ : సిరిసిల్ల ప్రాంతంలో ముగ్గురిని హతమార్చి మావోయిస్టు పార్టీని పునర్నిర్మించేందుకు కొందరు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఆయుధాల అన్వేషణలో డమ్మి పిస్టల్‌ను కొనుగోలు చేసి పోలీసులకు పట్టుబడ్డారు. మావోయిస్టుల పేరిట ముందస్తుగానే వాల్‌పోస్టర్లు అంటించి కలకలం సృష్టించిన ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకున్నారు. పోస్టర్ల వెనుక జరిగిన కుట్రను ఛేదించారు.
 
 ముగ్గురి హత్యలతో ఉద్యమం
 వేములవాడ మండలం మారుపాక వద్ద హత్యకు గురైన సుద్దాలకు చెందిన మాజీ సర్పంచ్ ఏనుగు వేణుగోపాల్‌రావు ఉరఫ్ ప్రభాకర్‌రావు హత్య కేసులో నిందితులుగా ఉన్న మొండయ్య, కుంటయ్య, లక్ష్మణ్‌ను హత్య చేసి మావోయిస్టుల పేరిట ఉద్యమం నడపాలన్న కుట్రను పోలీసులు కనిపెట్టారు.
 
 ఆ ముగ్గురిని హత్య చేస్తే రూ.15 లక్షలు సమకూర్చుతానని వేణుగోపాల్‌రావు తనయుడు హామీ ఇచ్చినట్లు పోలీసుల విచారణ తేలింది. భారీ మొత్తంలో డబ్బు రావడంతో ఆయుధాలు కొనుగోలు చేసి మావోయిస్టుల పేరిట విప్లవోద్యమాన్ని నడిపించేందుకు ఐదుగురు యువకులు కుట్ర పన్నారు. గడువులోగా ఆ ముగ్గురిని హతమార్చితే అనుకున్న సొమ్మును అప్పగించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో గడువు దాటిపోయి.. విషయం బయటకు రావడంతో పోలీసులు లోతుగా విశ్లేషించి కుట్ర చేసిన ఐదుగురిని పట్టుకున్నట్లు సమాచారం.
 
 డమ్మీ పిస్టల్‌తో వసూళ్లు
 కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన కిషన్, నాగరాజు, మల్కపేటకు చెందిన బోయిని రాజేందర్, శ్రీకాంత్, కొలనూరుకు చెందిన విష్ణులు డమ్మీ పిస్టల్‌ను కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ పిస్టల్‌ను చూపించి ఇద్దరు వ్యాపారుల వద్ద రూ. 30 వేలు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ డబ్బులతో నిజమైన ఆయుధం కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. ఆయుధాలను సేకరించే మార్గం లభించకపోవడంతో మాజీ నక్సలైట్లను కలిసినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మావోయిస్టుల పేరిట హత్యలకు పన్నిన కుట్రలు చేసే వ్యవహారం బయటపడింది. ఇటీవల కోనరావుపేట మండలం ధర్మారంతోపాటు పలు గ్రామాల్లో మావోయిస్టుల పేరిట పోస్టర్లు వేశారు. ముందుగా పోస్టర్లు వేసి భయం కలిగించి హత్యలతో మావోయిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని సదరు యువకులు వ్యూహం పన్నినట్లు తెలిసింది. హత్య కుట్ర కేసును ఛేదించే క్రమంలో మావోయిస్టుల పేరిటపోస్టర్లు వేసిన వ్యవహారం బయటపడింది.
 
 లోతుగా విచారిస్తున్న పోలీసులు
 ముగ్గురి హత్యకు కుట్ర పన్నిన వ్యవహారంలో పోలీసులు లోతుగా విశ్లేషిస్తున్నారు. శాస్త్రీయంగా ఫోన్ సంభాషణలను సేకరించి హత్య వెనుక కుట్రను ఆరా తీస్తున్నారు. కరీంనగర్ ఓఎస్డీ ఎల్.సుబ్బారాయుడు, సిరిసిల్ల డీఎస్పీ దామెర నర్సయ్య, రూరల్ సీఐ మహేశ్, కోనరావుపేట ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో విచారణ చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement