తెల్లవారితే పెళ్లి.. బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఫంక్షన్ హాల్‌లో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి.
ఘట్‌కేసర్, న్యూస్‌లైన్: తెల్లవారితే పెళ్లి.. బంధుమిత్రులు అందరూ వచ్చారు. ఫంక్షన్ హాల్‌లో వివాహ ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి వరకు పెళ్లికూతురిని ముస్తాబు చేసి సంప్రదాయం ప్రకారం అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. వధువు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది కదా.. అని కుటుంబీకులు భావించారు. అంతలోనే చేతులకు గోరింటాకు, కాళ్లకు పారాణితో ఉన్న పెళ్లికూతురు అదృశ్యం అయిందనే వార్త వారిని హతాశుల్ని చేసింది.
ఈ సంఘటన మండల పరిధిలోని నారపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, పెళ్లికూతురి
కథనం ప్రకారం.. ఘట్‌కేసర్ మండల పరిధిలోని నారపల్లికి చెందిన యువతి(24) ఇటీవలే ఏదులాబాద్‌లోని ఓ కాలేజీలో ఎంబీఏ పూర్తి చేసింది. ఉప్పల్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న ప్రవీణ్‌తో గురువారం ఆమె వివాహం చేసేందుకు పెద్దలు నిశ్చయించారు. కట్నంగా 15 తులాల బంగారం, బైకు, సామగ్రి ఇచ్చేందుకు యువతి తల్లిదండ్రులు అంగీకరించి ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. పెళ్లి బోడుప్పల్‌లోని ఫంక్షన్ హాల్‌లో ఉంది. ఇరు కుటుంబాల వారు వివాహానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. బుధవారం యువతి బంధువులు అందరూ గ్రామానికి చేరుకున్నారు. పెళ్లి కూతురిని అందంగా అలంకరించి సంప్రదాయ తంతులు అన్ని పూర్తి చేశారు. అర్ధరాత్రి సమయంలో కుటుంబీకులు, బంధువులు అందరూ నిద్రించారు. యువతి ఏకాంతంగా మరో గదిలో నిద్రించింది.
అర్ధరాత్రి సమయంలో ఆమె కోసం కుటుంబీకులు చూడగా కనిపించలేదు. ఆచూకీ కోసం స్నేహితుల వద్ద వెతికినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు వరుడి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. పెళ్లికూతురి అదృశ్యంతో పెళ్లికొడుకు కుటుంబీ కులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరువర్గాల వారు గొడవకు దిగారు. గురువారం సాయంత్రం యువతి తండ్రి రఘునాథరావు ఘట్‌కేసర్ పీఎస్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.