విమానం ఎగిరింది

విమానం ఎగిరింది - Sakshi


సాక్షి, కడప : జిల్లా వాసుల నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయం నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తూ వచ్చిన  కడప విమానాశ్రయాన్ని ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించగా, అనంతరం కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, సైన్స్ అండ్‌టెక్నాలజీశాఖ మంత్రి సుజనాచౌదరి జ్యోతి ప్రజ్వలన చేశారు. విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు నేతలు ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్‌వేస్ అధికారులు సీఎంతోపాటు కేంద్ర మం త్రులకు ఘన స్వాగతం పలికారు.



టెర్మినల్‌తోపాటు రన్‌వే, వెయిటింగ్ రూమ్, హాలుతోపాటు ఇతర అన్ని సౌకర్యాలను వారు పరిశీలించారు. అనంతరం టెర్మినల్ బయట ఏర్పాటు చేసిన సమావేశానికి చంద్రబాబుతోపాటు కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు రిమోట్ కంట్రోల్ బటన్‌తో విమానాశ్రయానికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.



 విమానాశ్రయ అభివృద్ధికి కృషి

 కడప విమానాశ్రయాన్ని మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు అశోక్‌గజపతిరాజు, వెంకయ్యనాయుడు, సుజనాచౌదరిలు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కడప విమానాశ్రయాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని, అంతేకాకుండా ఎయిర్‌లైన్స్ అంగీకరిస్తే నైట్‌ల్యాండింగ్‌కు చర్యలు చేపడతామన్నారు. తిరుపతి, పుట్టపర్తి, కడపలలో విమానాశ్ర యాలు ఉన్నాయని, అయితే కడపను మరింత విస్తరింపజేసేందుకు కృషి చేస్తామన్నారు.



రవాణా సౌకర్యం లేకపోతే పారిశ్రామికవేత్తలు రారని, విమానాశ్రయాన్ని ప్రారంభించడంతో పారిశ్రామిక వేత్తలు వచ్చేందుకు అవకాశం ఉందన్నారు. కడప నుంచి గల్ఫ్‌కు కూడా అధిక సంఖ్యలో వెళతారని, అలాగే కడప నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని నలుమూలలకు వెళ్లేందుకు అవకాశాలు కల్పిస్తామన్నారు. విమానాశ్రయం సమీపంలోనే ఏపీఐఐసీ సేకరించిన ఆరు వేల ఎకరాల భూమి కూడా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉందని.. రాష్ట్ర విభజన సందర్భంగా స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు ప్రకటించారు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే హైదరాబాదు, విజయవాడ, చెన్నై, విశాఖపట్టణం, ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్లడానికి కూడా అవకాశాలు వస్తాయని బాబు హామీ ఇచ్చారు.



 తొలి ప్రయాణికులతో మాటామంతి

 ఆదివారం విమానాశ్రయాన్ని ప్రారంభించిన అనంతరం బెంగళూరు నుంచి ఎయిర్ పెగాసిస్ విమానం కడపకు వచ్చింది. ఇందులో ప్రయాణించిన కొంతమంది ప్రయాణికులతో సీఎం చంద్రబాబు, మంత్రులు ముచ్చటించారు. అనంతరం వారితో ఫొటోలు దిగారు. తర్వాత కడప నుంచి బెంగళూరుకు మరో విమానం బయలుదేరింది.



 లోనికి అనుమతించలేదని బీజేపీ నేతల ధర్నా

 కేంద్ర మంత్రులతోపాటు సీఎం వస్తున్న నేపథ్యంలో పాసులు ఇచ్చిన కొందరిని మాత్రమే పోలీసులు విమానాశ్రయంలోకి అనుమతించడంతో టెర్మినల్ వద్ద ఆందోళన చోటుచేసుకుంది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శశిభూషణ్‌రెడ్డితోపాటు బీజేపీ నేత కందుల శివానందరెడ్డి, పలువురు బీజేపీ నాయకులు విమానాశ్రయం వద్ద ధర్నాకు ఉపక్రమించారు. దాదాపు అరగంటపాటు టీడీపీ డౌన్‌డౌన్....చంద్రబాబు డౌన్‌డౌన్...అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్న పోలీసులు డౌన్‌డౌన్ అంటూ పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు బయటికి వచ్చి వారికి సర్దిచెప్పి తీసుకెళ్లారు.



 జాతీయ జెండాకు అవమానం

 విమానాశ్రయం ప్రారంభోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేయాలని భావించిన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టెర్మినల్ ఎదురుగా ఏర్పాటు చేశారు. అయితే దిమ్మెకు పై ఉన్న స్తంభానికి జాతీయ జెండాను కట్టి...ఎగురవేసేందుకు సిద్ధం చేసినా సీఎంగానీ, కేంద్ర మంత్రులుగానీ పట్టించుకోలేదు. పైగా ఏర్పాటు చేసిన అధికారులైనా కనీసం సీఎం, ఇతర నేతలకు చెప్పి ఎగరవేయాల్సిందిపోయి...జాతీయ పతాకం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top