పదవి అంటే కిరీటం కాదు.. | That is not the position of the crown .. | Sakshi
Sakshi News home page

పదవి అంటే కిరీటం కాదు..

Aug 19 2013 2:20 AM | Updated on Sep 1 2017 9:54 PM

పదవి అంటే కిరీటం కాదని... అది గురుతర బాధ్యతని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన 316 మంది నూతన సర్పంచ్‌లకు ‘అధికారాలు... బాధ్యతలపై అవగాహన’ సదస్సును ఆదివా రం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు.

 సిద్దిపేట, న్యూస్‌లైన్: పదవి అంటే కిరీటం కాదని... అది గురుతర బాధ్యతని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన 316 మంది నూతన సర్పంచ్‌లకు ‘అధికారాలు... బాధ్యతలపై అవగాహన’ సదస్సును ఆదివా రం సిద్దిపేటలోని ఓ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరులైనట్లే... గ్రామానికి సర్పంచ్ కూ డా అంతేనన్నారు. తాను పంచాయతీరాజ్ శాఖ  మంత్రిగా చేసినప్పుడు 2001లో గ్రామ సచివాలయ వ్యవస్థను సృష్టించి 21,923 గ్రామాలకు కార్యదర్శులు ఉండేలా చూశామన్నారు. ఇప్పటి ప్రభుత్వం ఒక కార్యదర్శికి ఐదారు గ్రామా ల బాధ్యతలు అప్పగించి పంచాయతీ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందన్నారు. తాగు నీటి సరఫరా, వీధి దీపాలు, పరిసరాల పరిశుభ్రత అంశాలను సర్పంచులు వార్డుల వారీగా అనునిత్యం సమీక్షిస్తుండాలని సూచించారు. నూత న సర్పంచుల పనితీరు ఆధారంగానే పల్లెల్లో పార్టీ పలుకుబడి ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఇక ఆ బ్రహ్మదేవుడు కూడా ఆపలేడని ఆయన ధీమాగా చెప్పారు.
 
 సఖ్యతగా ఉంటేనే పనులు: రమణాచారి   
 సర్పంచులు ఆయా శాఖల అధికారులతో సఖ్యతగా, అనుకూల భావనలతో ఉంటేనే పనులవుతాయని టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి సూచించారు. అధికారులు కూడా అవగాహన ఉన్న సర్పంచులతో ఓ రకంగా, అమాయకులైన వారితో మరో విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. క్యాష్‌బుక్, లెడ్జర్, ఓచర్లు వంటి వాటి నిర్వహణలో అప్రమత్తం గా ఉండాలన్నారు. ప్రజలతో గౌరవ భావంతో మెదలు కోవాలన్నారు. తన 36 ఏళ్ల సర్వీసులో మహిళా ప్రజాప్రతినిధులున్న చోట ఎక్కువగా మగవారి పెత్తనమే కనిపించిందని, ఆ అపప్రదను తొలగించాలని ఆయన సూచిం చారు.
 
 చెక్ పవర్ సర్పంచుల సొంతం: హరీష్‌రావు
 రాష్ట్రపతి, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సైతం లేని చెక్‌పవర్ కేవలం సర్పంచులకే ఉందని ఎమ్మెల్యే టి.హరీష్‌రావు అన్నారు. ఆ అధికారాలను సరైన పద్ధతిలో వినియోగించుకోవాలని సూచించారు. హరీష్‌రావు ప్రతిపాదన మేరకు చెక్ పవర్ వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ సర్పంచులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. టీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన కొత్త సర్పంచులు తెలంగాణ భవన్‌లో కాలు మోపగానే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు.
 
 గ్రామాలు గులాబీమయం కావాలని, పంచాయతీ కార్యాలయాల్లో జయశంకర్, కేసీఆర్, తెలంగాణతల్లి చిత్రపటాలు ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కోరారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మాణిక్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి రాజయ్య యాదవ్, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పెద్దలింగారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి తన అనుభవాన్ని కొత్త ప్రజాప్రతినిధులకు వివరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement