ఆత్మస్థైర్యం ఆయుధం కావాలి | Thaneti Vanitha Handed Artificial Limbs To Disabled | Sakshi
Sakshi News home page

ఆత్మస్థైర్యం ఆయుధం కావాలి

Jun 28 2019 8:49 AM | Updated on Jun 28 2019 8:49 AM

Thaneti Vanitha Handed Artificial Limbs To Disabled - Sakshi

హెలెన్‌ కెల్లర్‌ జయంతి కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి వనిత

సాక్షి, ఏలూరు(పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలోని విభిన్న ప్రతిభావంతులు ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, ఇందుకోసం అవసరమైన సహాయాన్ని, సహాకారాన్ని ప్రభుత్వం అందించేందుకు సిద్ధంగా ఉందని రాష్ట్ర స్త్రీ,శిశు, వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. హెలెన్‌ కెల్లర్‌ జయంతి సందర్భంగా స్థానిక గిరిజనభవన్‌లో గురువారం విభిన్న ప్రతిభావంతులకు కృత్రిమ ఉపకరణాలను మంత్రి అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ వికలాంగుల పట్ల దయ చూపించాలని జాలి చూపిస్తే వారి ఆత్మస్థైర్యం దెబ్బతింటుందన్నారు.

విభిన్న ప్రతిభావంతులను ప్రోత్సహించి వారిలో ప్రతిభను వెలికి తీసి వారి భవిష్యత్‌ బాగుండేందుకు సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విభిన్న ప్రతిభావంతులు మానసిక ఆందోళనకు గురికాకూడదని పట్టుదల, కృషితో సకలాంగులతో సమానంగా అభివృద్ధి చెందేలా ఉండాలని కోరారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన విషయాలు తన దృష్టికి తీసుకురావాలని, కమ్యూనిటీ హాలు ఇతర మౌలిక వసతులు కలుగచేసే విషయంలో తన దృష్టికి తీసుకువస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

వయోపరిమితిలో సడలింపు ఇవ్వాలి
విభిన్న ప్రతిభావంతుల జేఏసీ చైర్మన్‌ అల్లాడి నటరాజు మాట్లాడుతూ వికలాంగుల హక్కుల రక్షణ చట్టం–2016ను అమలుచేయాలని, గ్రామ వలంటీర్ల నియామకంలో వికలాంగులకు అవకాశం ఇవ్వడంతో పాటు విద్యార్హత, వయోపరిమితుల్లో సడలింపు ఇవ్వాలని కోరారు. జిల్లాలో రెండో విడత మూడు చక్రాల మోటారు సైకిళ్లను త్వరితగతిన అందజేయాలని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. స్థానిక 25వ డివిజన్‌ కార్పొరేటర్, వైసీపీ నాయకులు బండారు కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వం కొంతమంది కోసమే పనిచేసిందని, ప్రస్తుతం అందరి ప్రభుత్వం వచ్చిందని సమస్య ఏదైనా, ఎవరిదైనా దాని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈసందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రం ఏలూరులో విభిన్న ప్రతిభావంతుల కోసం కమ్యూనిటీ హాలును నిర్మించాలని, అంధ నిరుద్యోగుల స్వయం ఉపాధి కోసం ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి శిక్షణ ఇప్పించాలని, శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

సదరం సర్టిఫికెట్ల జారీ చేసేటప్పుడు, మార్పులు, చేర్పులూ చేసే సమయంలో ఎక్కువ రోజులు పడుతోందని త్వరితగతిన సదరం సర్టిఫికెట్లు ఇప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. అనంతరం ఎన్‌జీఓలు, వివిధ సంఘాల నాయకులు మంత్రి తానేటి వనితను సన్మానించారు. విభిన్న ప్రతిభావంతుల సంఘాల నాయకులు వీరభద్రరావు, ఉమ్మా వెంకటేశ్వరరావు, రఫీ, ఎస్‌ వాసు, ఆర్‌ రాము, వి.శ్రీను, మనోజ్‌ కుమార్, దుర్గయ్య, సునీత, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విభిన్న ప్రతిభావంతులు  పాల్గొన్నారు.

138 మందికి కృత్రిమ అవయవాలు
జిల్లాలోని 138 మంది విభిన్న ప్రతిభావంతులకు రూ.7.40 లక్షల విలువైన కృత్రిమ అవయవాలను మంత్రి తానేటి వనిత అందజేశారు. సభకు అధ్యక్షత వహించిన విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ సహాయ సంచాలకులు వి.ప్రసాదరావు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఈ ఆర్థిక సంవత్సరం 2 వేల మందికి వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా మేలు చేశామన్నారు. దాదాపు వెయ్యి మందికిపైగా కృత్రిమ అవయవాలను పంపిణీ చేసినట్టు తెలిపారు.

1
1/1

దివ్యాంగుడికి కృత్రిమ కాలును  స్వయంగా అమరుస్తున్న మంత్రి వనిత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement