గుణ పాఠం నేర్వరా..!

Text Books Distributions This Year Also Delayed in YSR Kadapa - Sakshi

సకాలంలోపాఠ్యపుస్తకాలు అందేనా?

ఈ ఏడాది కేటాయించిన పుస్తకాలు 13.50 లక్షలు

నేటికీ డిపోకు చేరని  నూతన పాఠ్యపుస్తకాలు

విద్యార్థులకు సక్రమంగా బోధన జరిగేనా?  

కడప ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుడు బోధన చేయాలన్నా... విద్యార్థి పాఠం నేర్చుకోవాలన్నా పాఠ్యపుస్తకం తప్పనిసరి. అలాంటి పాఠ్యపుస్తకం విద్యార్థికి చేరడంలో ఏటా జాప్యం జరుగుతూనే ఉంది. విద్యా సంవత్సరం ప్రారంభం రోజుకు విద్యార్థులందరికి ఉచిత పాఠ్యపుస్తకాలతోపాటు యూనిఫాం అందజేస్తామంటూ అటు పాలకులు ఇటు అధికారులు చెబుతున్న మాటలు ప్రతి ఏటా నీటి మీద రాతలుగా మిగులుతున్నాయి. గతేడాది కూడా పుస్తకాలు, యూనిఫాం పంపిణీలో జాప్యం చోటు చేసుకుంది. పాఠ్యపుస్తకాలైతే విద్యా సంవత్సరం ప్రారంభమైన రెండు నెలల తరువాత కూడా కొన్ని టైటిల్స్‌ను ఇచ్చారు. మరి కొన్నింటిని ఇవ్వకుండానేవదిలేశారు. ఇక యూనిఫాం గురించి చెప్పనవసరం లేదు. ఎందుకుంటే పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చే నెలరోజుల వ్యవధిలో కూడా కొన్ని పాఠశాలలకు అందించారు. ఇక ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు సకాలంలో అందే పరిస్థితి కనిపించడంలేదు. ఇప్పటి వరకు డిపోకు పుస్తకాలే రాలేదు.

మారని ప్రభుత్వ తీరు
విద్యా సంవత్సరం ముగిసే సమయానికే పాఠ్యపుస్తకాలు సరఫరా చేయాలని ఉపాధ్యాయ సంఘాలు, తల్లిదండ్రులు ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు. అయినా పాఠ్యపుస్తకాల సరఫరాలో  ఏటా జాప్యం జరుగుతూనే ఉంది. ప్రతి ఏటా పాఠ్యపుస్తకాల సరఫరా ప్రహసనంగా మారుతోందనే విమర్శలు ఉన్నాయి.  ఫలితంగా చాలా మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య రోజురోజుకు తగ్గుతుండటంతో అవి మూతపడే దిశగా అడుగులేస్తున్నాయి.

ఇంకా జిల్లాకు చేరుకోని నూతన పాఠ్యపుస్తకాలు
2017–18 విద్యా సంవత్సరం ఏప్రిల్‌ 23తో ముగిసింది. ఈ ఏడాది జూన్‌ 12వ తేదీ నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ నెలాఖరుకు జిల్లాకు అవసరమైన పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తేనే పాఠశాలలు పునః ప్రారంభించే నాటికి అవి విద్యార్థుల చేతిలో ఉంటాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు జిల్లా పుస్తక గోదాముకు చేరుకోలేదు.

13.50 లక్షలు అవసరం
 జిల్లాలో 2470 ప్రాథమిక, 262 ప్రాథమికోన్నత, 307 ఉన్నత పాఠశాలల విద్యార్థులకు ప్రతి ఏటా ఉచిత పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం సరఫరా చేస్తుంది. జిల్లాలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకూ సుమారు 1,72,377 మంది  విద్యార్థులకు ఈ ఏడాది 13,50,000 పుస్తకాలు అవసరమని విద్యాశాఖ గుర్తించింది. నూతన పాఠ్య పుస్తకాలు ఇప్పటి వరకు డిపోకు చేరుకోలేదని మేనేజర్‌ పెంచలమ్మ తెలిపారు.

టెండర్‌ పూర్తి
పాఠ్యపుస్తకాలను కడప బుక్‌ డిపో నుంచి జిల్లాలోని అన్ని మండలాలకు తరలించేందుకు విద్యాశాఖ టెండర్‌ను పూర్తి చేసింది. సంబంధిత పాఠ్యపుస్తకాలను తరలించే టెండర్‌ను ఈ ఏడాది గతానికి భిన్నంగా ఆర్టీసీ వారు  రూ. 6,07,500 టెండర్‌ను దక్కించుకున్నారు. పాఠ్యపుస్తకాలు గోడౌన్‌కు రాగానే సంబంధిత పుస్తకాల తరలింపును ప్రారంభిస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top