ఎక్కడివాళ్లు అక్కడే 

Termination of Deputations in Medical and Health Department - Sakshi

వైద్య ఆరోగ్యశాఖలో డెప్యుటేషన్లు రద్దు 

గత ఐదేళ్లుగా కొలువొకచోట–చేసేది మరోచోట 

అవసరమైతే ఖాళీల భర్తీ, అదనపు పోస్టుల మంజూరుకు నూతన సర్కారు అనుమతి 

ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి కార్యాలయం 

సాక్షి, అమరావతి: వైద్య ఆరోగ్యశాఖలో గత సర్కారు ఇష్టారాజ్యంగా డెప్యుటేషన్లు, బదిలీలు చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం కీలకనిర్ణయం తీసుకుంది. ఈ శాఖలో డెప్యుటేషన్లు రద్దు చేయాలని నిర్ణయించారు. వందల సంఖ్యలో డాక్టర్లు, స్టాఫ్‌ నర్సులు, తదితరులు పోస్టింగ్‌లు ఒకచోట, పనిచేస్తున్నది మరోచోట కావటంతో ఎక్కడ ఎవరు పనిచేస్తున్నారు? ఎన్ని ఖాళీలున్నాయి? అన్నది తెలియడంలేదు. వైద్యులు మిస్‌మ్యాచింగ్‌ (తన స్పెషాలిటీ కాకపోయినా అందులో కొనసాగడం) పోస్టుల్లో కొనసాగుతుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

సైకియాట్రిస్ట్‌ పని ప్లాస్టిక్‌ సర్జన్‌ 
మెడికల్‌ కళాశాలల్లో చాలామంది అసోసియేట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లు డెప్యుటేషన్లపై కొనసాగుతున్నారు. అనంతపురం, శ్రీకాకుళం, ఒంగోలు, నెల్లూరు తదితర బోధనాసుపత్రుల్లో పనిచేయాల్సిన చాలామంది వైద్యులు కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ తదితర చోట్ల ఉన్నట్టు తేలింది. సైకియాట్రీ ప్రొఫెసర్‌ పనిచేయాల్సిన చోట ప్లాస్టిక్‌ సర్జన్‌ పనిచేస్తున్నారన్న ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు కూడా జిల్లా కేంద్రాల్లో డెప్యుటేషన్లమీద కొనసాగుతున్నారు. 

రోగులకు ఇబ్బంది కలగకూడదనే...
డెప్యుటేషన్లన్నిటినీ రద్దుచేసి వారికి ఎక్కడ పోస్టింగ్‌ ఉందో తక్షణమే అక్కడకు పంపించాలని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శికి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఎక్కడ పనిచేయాలో వాళ్లను అక్కడకు పంపించి ఖాళీలెన్ని ఉన్నాయి, అదనంగా ఎంతమందిని నియమించాలన్న వివరాలు సర్కారుకు పంపించాలని సీఎంఓ కార్యాలయం ఆదేశించింది. దీనిపై ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి డా. పీవీ రమేష్‌  ‘సాక్షి’తో మాట్లాడుతూ రోగులకు ఇబ్బంది కలగకుండా చూడాలని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.  సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సైతం వైద్యుల కొరతపై పలు సిఫార్సులు చేసిందని ఆయన చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top