‘తాత్కాలిక’ తప్పిదం! | Temporary Forensic Science Laboratory in Mangalagiri | Sakshi
Sakshi News home page

‘తాత్కాలిక’ తప్పిదం!

Published Sat, Sep 30 2017 3:12 PM | Last Updated on Sat, Aug 18 2018 8:05 PM

Temporary Forensic Science Laboratory in Mangalagiri - Sakshi

రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిర్మాణాన్ని చేపట్టింది.

సాక్షి, అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం మంగళగిరిలో హడావుడిగా తాత్కాలిక ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్‌) నిర్మాణాన్ని చేపట్టింది. దీనికోసం కోట్లాది రూపాయలు కుమ్మరిస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల అమరావతికి ఎఫ్‌ఎస్‌ఎల్‌ను మంజూరుచేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఈ తాత్కాలిక ల్యాబ్‌ నిర్మాణమెందుకన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్‌లో ఉన్న ఎఫ్‌ఎస్‌ఎల్‌ పోలీసుల దర్యాప్తులో ఇతోధిక పాత్ర పోషించింది. అది విభజన చట్టం 10వ షెడ్యూల్లో ఉండటంతో ఇంకా పంపిణీ జరగలేదు. ప్రసుతం ఏపీలో ఐదు రీజినల్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ సెంటర్లున్నా హైదరాబాద్‌లోని మెయిన్‌ ల్యాబ్‌ను కూడా అరకొరగా వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో ఉన్న రీజినల్‌ ఎఫ్‌ఎస్‌ఎల్‌ సెంటర్లను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదు.  

ఇంకా ‘తాత్కాలికం’ ఎందుకు?
కేంద్ర ప్రభుత్వం అమరావతికి కొత్తగా ఎఫ్‌ఎస్‌ఎల్‌ను కేటాయించిన నేపథ్యంలో ఇటీవల కొత్తగా చంద్రబాబు సర్కారు చేపట్టిన తాత్కాలిక ఎఫ్‌ఎస్‌ఎల్‌ ఎందుకు.. అనే చర్చ జరుగుతోంది. ఏపీ రాజధాని ప్రాంతంలో తాత్కాలిక ఫొరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీని మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 13న ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకోసం తొలిదశలో రూ.27 కోట్లు కేటాయించింది. మంగళగిరిలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ సమీపంలో తాత్కాలిక ఎఫ్‌ఎస్‌ఎల్‌ కోసం ఐదు అంతస్తుల భవన నిర్మాణం చేపట్టారు. తొలి మూడు అంతస్తులు పోలీస్‌ శాఖ అవసరాలకు, పైరెండు అంతస్తులు ఎఫ్‌ఎస్‌ఎల్‌ కోసం కేటాయించారు. దానిలో పరికరాలు (ఎక్విప్‌మెంట్‌)కు, సైంటిఫిక్‌ స్టాఫ్‌కు వేతనం (కన్సాలిడేట్‌ పే) కోసం ఏడాదికి రూ.1.08 కోట్లు, రికరింగ్‌ బడ్జెట్‌గా రూ.72 లక్షలు కేటాయించడం గమనార్హం. ఈ నెల 27న జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో దేశంలో అంతర్గత భద్రత పథకానికి రూ.25 వేల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దానిలో భాగంగానే ఏపీ రాజధాని అమరావతిలో ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబొరేటరీని మంజూరుచేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మీడియాకు వెల్లడించారు. పోలీసు మౌలిక వసతుల కల్పన, శిక్షణ సంస్థలు, దర్యాప్తు సదుపాయాల నిమిత్తం కేటాయించిన రూ.100 కోట్లలోంచి అమరావతి ఎఫ్‌ఎస్‌ఎల్‌కు నిధులు కేటాయిస్తామని తెలిపారు. వచ్చే ఏడాది కాలంలో దీని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. దీని కోసం ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వెలగపూడి సచివాలయం సమీపంలో మూడెకరాల స్థలం కేటాయించింది. కేంద్ర నిధులు మంజూరయ్యాక రాజధానిలో ఎఫ్‌ఎస్‌ఎల్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. అయినా మంగళగిరిలో కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న తాత్కాలిక ల్యాబ్‌ పనులు జరుగుతూనే ఉండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement