తాత్కాలిక కూపన్లే! | Temporary coupons! | Sakshi
Sakshi News home page

తాత్కాలిక కూపన్లే!

Jan 22 2015 3:58 AM | Updated on Sep 2 2017 8:02 PM

తాత్కాలిక కూపన్లే!

తాత్కాలిక కూపన్లే!

ఆహారభద్రత కింద ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌సరుకులు తాత్కాలిక కూపన్ల ప్రాతిపదికనే ఇవ్వనుంది.

ఆహారభద్రత కార్డుల జారీ మరింత ఆలస్యం
 

ముకరంపుర : ఆహారభద్రత కింద ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌సరుకులు తాత్కాలిక కూపన్ల ప్రాతిపదికనే ఇవ్వనుంది. కార్డుల జారీ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక కూపన్లు అందించి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు ఆహారభద్రత కింద కొత్తకార్డుల జారీ, అనర్హుల ఏరివేత, అర్హుల గుర్తింపు నిరంతరంగా సాగుతోంది.

ఇది అధికారుల్లో కొంత గందరగోళాన్ని కలిగిస్తుండడంతో పునరాలోచనలో పడిన యంత్రాంగం.. కార్డులకు బదులు కూపన్లు ఇచ్చి సరుకులు అందించాలని చూస్తోంది. ఈ మేరకు కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు ప్రత్యేకంగా దృష్టిసారించారు. జిల్లాలోనే తాత్కాలిక కూపన్లను ముద్రించి పంపిణీ చేసేందుకు ఆమోదించినట్లు సమాచారం. ఈ కూపన్లను ఫిబ్రవరి ఒకటి నుంచి అందించి రెండు నెలలపాటు సరుకులు ఇవ్వనున్నారు. ఆ లోపు కొత్తకార్డుల జారీకి కొలిక్కి తేనున్నారు.
 
ప్రచ్ఛన్నయుద్ధం
ఆహారభద్రత విషయంలో గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ రేషన్‌డీలర్లు, ప్రజల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జాబితాలో పేర్లు లేకపోవడం.. చిరునామాల మార్పు.. వెబ్‌సైట్‌లో పేరు కనిపించకపోవడం.. పేరుంటేనే సరుకులు ఇస్తామని డీలర్లు చెబుతుండడంతో గ్రామాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. అర్హుల పేర్లూ లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు లేదంటున్న అధికార యంత్రాంగం.. ప్రజల నుంచి మరోసారి అర్జీలు స్వీకరిస్తోంది. అందులోంచి అర్హులను గుర్తిస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది.
 
పెరిగిన లబ్ధిదారులు
జిల్లాలో 9,76,022 కుటుంబాలుంటే గతంలో 11,88,974 రేషన్ కార్డులుండేవి. ఇందులో గులాబీకార్డులు 99,806, తెల్లకార్డులు 10,89,168. కుటుంబాలను మించి కార్డులు ఉండడంతో ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో ఆహారభద్రత కార్డుల జారీని ప్రారంభించింది. అయితే అనూహ్యంగా 12,37,540 దరఖాస్తులు వచ్చాయి. నెలక్రితం జిల్లావ్యాప్తంగా 9.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన అధికారు లు రేషన్‌సరుకులు అందిస్తున్నారు.

అర్జీల స్వీకరణ, విచారణ నిరంతరం చేస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు 10,29,825మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. 10,46,364 డేటాఎంట్రీ పూర్తయ్యింది. మిగిలినవి నమోదు చేయాల్సి ఉంది.
 
నిరంతర ప్రక్రియ : డీఎస్‌వో చంద్రప్రకాశ్
ఆహారభద్రతకార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు లేదు. ఇది నిరంత ర ప్రక్రియ. పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తాం. కార్డులకు బదులు తాత్కాలిక కూపన్ల జారీ విషయంలో జేసీ నిర్ణయం తీసుకుంటారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement