breaking news
Joint Collector pausumi Basu
-
‘డబుల్ బెడ్రూం’ స్థలాలు గుర్తించండి
‘ఇందిరమ్మ’ బిల్లుల కోసం విచారణ బృందాలు మిడ్‌మానేరు నిర్వాసితులకు 4723 ఇళ్ల మంజూరు గృహ నిర్మాణంపై ఇన్చార్జి కలెక్టర్ పౌసమీబసు సమీక్ష ముకరంపుర : ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రెండు పడక గదుల నిర్మాణాల కోసం పట్టణ, గ్రామీణ ప్రాంతాలలోని ప్రభుత్వ ఖాళీస్థలాల వివరాలు శనివారంలోగా సమర్పించాలని ఇన్చార్జి కలెక్టర్ జేసీ పౌసమీబసు సమీక్షించారు. శుక్రవారం కలెక్టరేట్లో గృహనిర్మాణాలపై హౌసింగ్ పీడీ పి.నరసింహారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లతో సమీక్షించారు. ప్రగతిలో ఉన్న 2437 ఇళ్లకుగాను 1376 ఇళ్లు పర్యవేక్షించిన నివేదికలు అందాయని, మిగిలిన ఇళ్లను రెండు రోజుల్లోగా పర్యవేక్షించి నివేదిక ఇవ్వాలని కోరారు. ఇళ్ల లబ్ధిదారుల జాబితా ప్రకారం నియోజకవర్గానికి ఆర్డీవో, తహశీల్దార్లతో కూడిన ప్రత్యేక బృందాలు విచారణ చేపట్టాలని, పరిశీలన పూర్తయిన అనంతరం లబ్ధిదారులకు బిల్లులు చెల్లింపులుంటాయని అన్నారు. జిల్లాలో ఇంకా మిగిలిన 44,789 మంది ఇళ్ల లబ్ధిదారుల రేషన్ కార్డుల వివరాలు ఈ నెల 31వతేదీలోగా సేకరించి పూర్తిచేయూలన్నారు. మంజూరైన 21,7827 ఇళ్లకుగాను 17,5927 మంది లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్‌కార్డుల వివరాలు ఆన్లైన్లో అనుసంధానం చేసినట్లు చెప్పారు. మిగిలిన 41,900 మందివి ఈనెల 31లోగా పూర్తి చేయాలన్నారు. మిడ్‌మానేరు ప్రాజెక్ట్ నిర్వాసితులకు జీవో నంబర్ 42 ద్వారా 4723 గృహాలు నూతనంగా మంజూరు చేయడం జరిగిందని, ఇందుకు సంబందించిన లబ్ధిదారులు పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి వర్షాకాలానికి ముందే పనులు మొదలు పెట్టాలన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిర్వాసితులకు రామగుండం మండలానికి సంబంధించి 816, వెల్గటూర్ మండలానికి సంబంధించి 256 గృహాల పనులు ఇప్పటివరకు ప్రారంభించకపోవడానికి గల కారణాలేంటో సంబంధిత ఆర్డీవోలను సంప్రదించి నివేదికలివ్వాలని ఆదేశించారు. -
తాత్కాలిక కూపన్లే!
ఆహారభద్రత కార్డుల జారీ మరింత ఆలస్యం ముకరంపుర : ఆహారభద్రత కింద ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌సరుకులు తాత్కాలిక కూపన్ల ప్రాతిపదికనే ఇవ్వనుంది. కార్డుల జారీ ప్రక్రియకు మరో రెండు నెలల సమయం పట్టనున్న నేపథ్యంలో తాత్కాలిక కూపన్లు అందించి వాటి ఆధారంగానే సరుకులు ఇవ్వాలని అధికారయంత్రాంగం నిర్ణయించింది. మరోవైపు ఆహారభద్రత కింద కొత్తకార్డుల జారీ, అనర్హుల ఏరివేత, అర్హుల గుర్తింపు నిరంతరంగా సాగుతోంది. ఇది అధికారుల్లో కొంత గందరగోళాన్ని కలిగిస్తుండడంతో పునరాలోచనలో పడిన యంత్రాంగం.. కార్డులకు బదులు కూపన్లు ఇచ్చి సరుకులు అందించాలని చూస్తోంది. ఈ మేరకు కొత్తగా వచ్చిన జాయింట్ కలెక్టర్ పౌసుమి బసు ప్రత్యేకంగా దృష్టిసారించారు. జిల్లాలోనే తాత్కాలిక కూపన్లను ముద్రించి పంపిణీ చేసేందుకు ఆమోదించినట్లు సమాచారం. ఈ కూపన్లను ఫిబ్రవరి ఒకటి నుంచి అందించి రెండు నెలలపాటు సరుకులు ఇవ్వనున్నారు. ఆ లోపు కొత్తకార్డుల జారీకి కొలిక్కి తేనున్నారు. ప్రచ్ఛన్నయుద్ధం ఆహారభద్రత విషయంలో గ్రామాలతోపాటు పట్టణాల్లోనూ రేషన్‌డీలర్లు, ప్రజల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. జాబితాలో పేర్లు లేకపోవడం.. చిరునామాల మార్పు.. వెబ్సైట్లో పేరు కనిపించకపోవడం.. పేరుంటేనే సరుకులు ఇస్తామని డీలర్లు చెబుతుండడంతో గ్రామాలు యుద్ధభూమిని తలపిస్తున్నాయి. అర్హుల పేర్లూ లేకపోవడంతో వారంతా ఆందోళనకు దిగుతున్నారు. దరఖాస్తుల స్వీకరణకు గడువు లేదంటున్న అధికార యంత్రాంగం.. ప్రజల నుంచి మరోసారి అర్జీలు స్వీకరిస్తోంది. అందులోంచి అర్హులను గుర్తిస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతోంది. పెరిగిన లబ్ధిదారులు జిల్లాలో 9,76,022 కుటుంబాలుంటే గతంలో 11,88,974 రేషన్ కార్డులుండేవి. ఇందులో గులాబీకార్డులు 99,806, తెల్లకార్డులు 10,89,168. కుటుంబాలను మించి కార్డులు ఉండడంతో ప్రభుత్వం ప్రక్షాళన పేరుతో ఆహారభద్రత కార్డుల జారీని ప్రారంభించింది. అయితే అనూహ్యంగా 12,37,540 దరఖాస్తులు వచ్చాయి. నెలక్రితం జిల్లావ్యాప్తంగా 9.45 లక్షల మందిని అర్హులుగా గుర్తించిన అధికారు లు రేషన్‌సరుకులు అందిస్తున్నారు. అర్జీల స్వీకరణ, విచారణ నిరంతరం చేస్తుండడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇలా ఇప్పటివరకు 10,29,825మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. 10,46,364 డేటాఎంట్రీ పూర్తయ్యింది. మిగిలినవి నమోదు చేయాల్సి ఉంది. నిరంతర ప్రక్రియ : డీఎస్వో చంద్రప్రకాశ్ ఆహారభద్రతకార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు నిర్ణీత గడువు లేదు. ఇది నిరంత ర ప్రక్రియ. పేర్లు లేనివారు దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి మంజూరు చేస్తాం. కార్డులకు బదులు తాత్కాలిక కూపన్ల జారీ విషయంలో జేసీ నిర్ణయం తీసుకుంటారు.