తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలు




 సాక్షి, హైదరాబాద్: తెలుగు భాషా సాహిత్యాలు, సంస్కృతి, వివిధ కళా ప్రక్రియల్లో విశిష్ట సేవలందించిన 12 మంది ప్రముఖులకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు(ఉపకులపతి) ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన గల ఎంపిక సంఘం.. 11 రంగాలకు సంబంధించి 12 మంది పురస్కార గ్రహీతలను ఎంపిక చేసింది. తిరునగరి(కవిత్వం), శలాక రఘునాథశర్మ(విమర్శ), బైరు రఘురాం(చిత్రకళ), కె.వి.సత్యనారాయణ(నృత్యం), ద్వారం దుర్గాప్రసాదరావు(సంగీతం), పాశం యాదగిరి(పత్రికా రంగం), డాక్టర్ బి.నాగిరెడ్డి(నాటక రంగం), పిల్లిట్ల సంజీవ(జానపద కళారంగం), నిడమర్తి లలితా కామేశ్వరి, కాశీభొట్ల రమాకుమారి(అవధానం), శివరాజు సుబ్బలక్ష్మి(ఉత్తమ రచయిత్రి), కలువకొలను సదానంద(కథ/నవల) ఈ పురస్కారాలకు ఎంపికైనట్లు తెలుగు విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.ఆశీర్వాదం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

 

  ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్స్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. ఉన్నత విద్యామండలి అధ్యక్షుడు ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై పురస్కారాలను ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.20,116 నగదు, పురస్కార పత్రం అందజేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top