కార్యకర్తల అభీష్టం మేరకే పాలన

కార్యకర్తల అభీష్టం మేరకే పాలన - Sakshi


శ్రీకాకుళం సిటీ: తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే ప్రధాన కారణమని, వారి ఆలోచనలు, సూచనల మేరకు ప్రభుత్వం పాలన సాగిస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి కె.అచ్చెన్నాయుడు చెప్పారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు చౌదరి బాబ్జి అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఈ నెల 17, 18 తేదీల్లో సీఎం చంద్రబాబు జిల్లా పర్యటిస్తారని, కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. జిల్లాలో పాలన గాడిలో పడాల్సి ఉందన్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణానికి కలెక్టర్ 90 సెంట్ల భూమి కేటాయించారని, ప్రతి కార్యకర్త గర్వపడేలా భవనం నిర్మిస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రదర్శించిన వైఖరి సరిగా లేదన్నారు.

 

 విధాన నిర్ణయాలు వ్యతిరేకించే అధికారుల భరతం పడతాం:కూన

 ప్రభుత్వ విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ అధికారులెవరైనా సరే టీడీపీ ప్రభుత్వ పరంగానే పనిచేయా ల్సి ఉంటుందని, అలాకాకుండా పార్టీ విధాన నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తే వారి భరతం పడతామని హెచ్చరించారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు. ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ జిల్లా సమర్థులకే పార్టీ పదవులు కట్టబెట్టిందని, జిల్లా ప్రగతి పథం పడుతుందని పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయానికి తన తండ్రి ఎర్రన్నాయుడు పేరు పెట్టాలని కోరారు. చౌదరి బాబ్జీ మాట్లాడుతూ జిల్లాలో పార్టీ వైభవానికి దివంగత ఎర్రంనాయుడే కారణమని, జిల్లాకు, పోలవరం ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టాలని తీర్మానం చేశామన్నారు. అంతకుముందు పలువురు కార్యకర్తలు మాట్లాడుతూ పదేళ్లుగా ఇబ్బందులు పడుతున్న తమను ఆదుకోవాలని కోరారు.

 

 కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ధనలక్ష్మి, శ్రీకాకుళం, నరసన్నపేట, ఇచ్ఛాపురం ఎమ్మెల్యేలు గుండ లక్ష్మీదేవి, బగ్గు రమణమూర్తి, బెందాళం అశోక్, మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబునాయుడు, మాజీ ఎమ్మెల్యేలు దువ్వాడ నాగావళి, తలే భద్రయ్య, పాతపట్నం, పాలకొండ నియోజకవర్గ ఇన్‌చార్జిలు శత్రుచర్ల విజయరామరాజు, నిమ్మక జయకృష్ణ, జిల్లా పార్టీ ముఖ్యులు పి.వి.రమణ, పేర్ల గోవిందరాజులు, జామి భీమశంకర్, గొండు వెంకటరమణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top