అడవి మనసులు!

Tekulapenta Village People Want Electricity And Transport Prakasam - Sakshi

నాగరిక జీవితానికి దూరంగా టేకులపెంట వాసులు

గ్రామానికి వెళ్లాలంటే కొండల్లో ఏడు కి.మీ నడవాల్సిందే..

బడి, అంగన్‌వాడీ కేంద్రం మాటేలేదు

ఆరేళ్లుగా విద్యుత్‌ సరఫరాకు నోచుకోని వైనం

అనారోగ్యం వస్తే డోలీ కట్టి కోనపల్లెకు మోసుకెళ్లాల్సిన దుస్థితి

తాగునీటి కోసం 2 కి.మీ దూరంలో ఉన్న బావి చెంతకు..

ఉన్నచోటే ఉంటాం.. సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి

కొండల కోనల మధ్య నాగరిక జీవనానికి..అభివృద్ధికి ఆమడ దూరంలో చీకటిలో మగ్గుతోంది టేకులపెంట గ్రామం. కొమరోలు మండలం చింతలపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లాలంటే ఏడు కిలోమీటర్ల రాళ్లుతేలిన మట్టిబాటే శరణ్యం.  ఆ ఊరి మొత్తం మీద అక్షరాలు నేర్చిన వారు ముగ్గురే. ఆ ఊరికి విద్యుత్‌ వెలుగులే లేవు..ఇక ఫోను, టీవీ సంగతి సరేసరి. దప్పికేస్తే నేల బావి..ప్రాణం మీదకొస్తే డోలీలే దిక్కు. ఆ గ్రామస్తుల స్థితిగతులపై సాక్షి కథనం

గిద్దలూరు:    సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ ప్రపంచమే కుగ్రామంగా మారిన ఈ రోజుల్లో ఫోన్, టీవీకి దూరంగా జీవిస్తున్న వారు ఉన్నారంటే మీరు నమ్మగలరా? నెలకు ఓసారి కూడా వారు బస్సులు, ఆటోల ముఖం చూడరంటే  అతిశయోక్తి అనిపిస్తుంది కానీ అదే నిజం.! నాగరిక జీవనానికి దూరంగా ఉంటున్న ఆ గ్రామం పేరు టేకులపెంట. కొమరోలు మండలం చింతలపల్లెపంచాయతీ పరిధిలో ఉంటుందీ ఊరు. ఏదైనా పనిమీద గ్రామం నుంచి బయటకురావాలంటే ఏడు కి.మీ దూరం రాళ్లు, ముళ్లపొదల్లో క్రూర మృగాల మధ్య నడిచి వెళ్లాలి. సాయంత్రం ఆరు గంటలు దాటితే చిమ్మచీకటి. గ్రామానికి 2 కి.మీ దూరంలో ఉన్న నేలబావి నీటితోనే నేటికీ దప్పిక తీర్చుకుంటున్నారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం లేదు. 60 మంది జనాభా నివసిస్తున్న గ్రామంలో చదువుకున్న వారు ముగ్గురే. సుస్తీ చేస్తే డోలీ కట్టుకుని ఏడు కి.మీ దూరం నడవాల్సిన దుస్థితి.  సంక్షేమ పథకాలకు అర్హులైనా అవి అందించే మార్గం లేక అధికారులు తలపట్టుకుంటున్నారు. ‘మాకు రోడ్డు, కరెంటు, తాగునీటి బోరు ఏర్పాటు చేస్తే చాలు’ అంటున్నారే తప్ప గ్రామాన్ని ఖాళీ చేసిజనజీవన స్రవంతిలోకి వస్తామని చెప్పడం లేదు. 

టేకులపెంట వాసులకు ఏ అవసరమొచ్చినా, ఆపదొచ్చినా రాళ్లతో కూడిన దుర్భరమైన ఈ రహదారిలోనే ఏడు కిలోమీటర్ల దూరంప్రయాణించాలి..
కొండల మధ్య జీవనం
చింతలపల్లె పంచాయతీ పరిధిలోని టేకులపెంట గ్రామం కొండల మధ్య ఉంది. వీరు ఐదు కి.మీ దూరంలో ఉన్న పంచాయతీ కేంద్రానికి చేరుకోవాలంటే కనీసం ఐదు గంటల సమయం పడుతుంది. దట్టమైన అడవులు, కొండల్లో చెట్లను తప్పించుకుంటూ నడవాలి. వీరు పంచాయతీ కేంద్రానికి వచ్చేది ఎన్నికల సమయంలోనే. రేషన్‌కార్డులు ఉన్నా సరుకులు తీసుకునేది తక్కువే. దట్టమైన అడవి మధ్య 40 కుటుంబాల వరకు ఉండేవి. అందరిదీ ఒకే సామాజిక వర్గం. కాలక్రమంలో ఒక్కొక్కరుగా గ్రామాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం 14 కుటుంబాలకు చెందిన 60 మంది మాత్రమే నివసిస్తున్నారు. గ్రామానికి చుట్టూ రాతితో గోడ కట్టి అడవి జంతువులు రాకుండా చిన్న గేటు ఏర్పాటు చేసుకోవడం విశేషం. 

జబ్బు చేస్తే డోలీ కట్టాల్సిందే.. 

టేకులపెంటలో ఎవరికైనా జబ్బు చేస్తే డోలీ కట్టుకుని ఏడు కిలోమీటర్ల దూరంలోని కోనపల్లి వరకు మోసుకెళ్లాల్సిన దీనావస్థ. అక్కడ నుంచి ఆటోలో సమీప వైద్యశాలకు వెళ్తారు. అనారోగ్యం నుంచి కోలుకుంటే చిన్నగా గ్రామానికి వెళ్తారు. లేదంటే బంధువుల వద్దకు వెళ్లి ఆరోగ్యం బాగయ్యాకే తిరిగి స్వగ్రామానికి వెళ్తారు. గర్భిణులు నెలలు నిండితే సాధారణ ప్రసవం చేస్తారు. లేదంటే డోలిలోనే వైద్యశాలకు తీసుకెళ్తారు. ఈ గ్రామంలో ముగ్గురు విద్యార్థులు ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్నారు. సెల్‌ఫోన్‌ కొనుక్కున్నా చార్జింగ్‌ పెట్టేందుకు కరెంటు లేదు. మాట్లాడేందుకు సెల్‌ టవర్‌ సిగ్నల్‌ అందదు. కొండ నుంచి మైదాన ప్రాంతానికి రావాలని అధికారులు సూచించినా గ్రామస్తులు ఇష్టపడటం లేదు. ఎన్ని కష్టాలు ఎదురైనా మొండిగా భరిస్తున్నారు. గ్రామానికి రోడ్డు, తాగునీటి బోరు, విద్యుత్‌ సరఫరా తదితర వసతులు కల్పిస్తే ‘మా బతుకు మేము బతుకుతాం’ అని చెబుతున్నారు.

టేకులపెంట గ్రామం వ్యూ
సమస్యలతో సతమతం
టేకులపెంట గ్రామం కొమరోలు మండలంలో ఉన్నప్పటికీ వీరికి ఏ అవసరం వచ్చినా బేస్తవారిపేట మండలంలోని కోనపల్లెకు వెళ్తారు. ఇందుకు ఏడు కిలోమీటర్లు నడవాలి. నడిచేందుకు సరైన రోడ్డు మార్గం లేదు. మొనదేలిన రాళ్లపై కిందామీద పడుతూ వెళ్లాల్సిన పరిస్థితి. ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నేలబావి(దిగుడుబావి) వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుని దాహార్తి తీర్చుకుంటున్నారు. ఆ నీటితోనే అన్ని అవసరాలు తీర్చుకుంటున్నారు. సత్యసాయి ట్రస్టు ఆధ్వర్యంలో గతంలో మోటారు ఏర్పాటు చేసినా అది మరమ్మతులకు గురయ్యాక ఎవరూ పట్టించుకోలేదు. ఆరేళ్ల క్రితం వరకు విద్యుత్‌ సరఫరా ఉన్న ఈ గ్రామం.. ప్రస్తుతం చీకట్లో మగ్గుతోంది. ఆరేళ్ల క్రితం గాలివాన బీభత్సంతో స్తంభాలు నేలకొరిగి, తీగలు తెగిపోవడంతో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. సోలార్‌ ఎల్‌ఈడీ లైటు ఏర్పాటు చేసినా అది పనిచేయడం లేదు. 

మేకల పెంపకం, చిరుధాన్యాల సాగు 

అడవుల్లో ఉన్న వీరు వాణిజ్య పంటలు సాగుచేయరు. వర్షాధార పంటలుగా చిరుధాన్యాలైన కొర్రలు, సజ్జ, జొన్న, రాగులు, ఉలవలుపండిస్తున్నారు. వాటినే ఆహారంగా తింటున్నారు. దీంతో తమ శరీరం దృఢంగా ఉంటుందనిగ్రామస్తులు చెబుతున్నారు. అడవుల్లో గడ్డిఎక్కువగా లభ్యమవుతున్నందున మేకలు, గేదెలు పెంచుతున్నారు. అడవులకు ఎలాంటి హాని తలపెట్టకుండా జీవనం సాగిస్తున్నారు. ధాన్యం ఎక్కువగా పండితే మూటలు కట్టుకునిమోసుకుంటూ వెళ్లి విక్రయించుకుని బియ్యం, ఇతర సరుకులు తెచ్చుకుంటారు.

తాగునీరు, కరెంటు, రోడ్డు ఏచ్చే ఇక్కడే బతుకుతామయ్యా 
మాకు ఏమొద్దయ్యా తాగేదానికి బోరు, కరెంటు లైను, ఊర్లోకి వచ్చేదానికి రోడ్డు ఏచ్చే ఎలాగోలా ఇక్కడే బతుకుతాం. దేవుని దయవలన వానలు పడుతున్నాయి. అంతో ఇంతో పంటలు పండుతాయి. అనారోగ్యం సేచ్చే రోడ్డు ఉంటే ఏదొక ఆటోను పిలుచుకొచ్చుకుని ఆసుపత్రికి పోతాం. అసలు మాకు జ్వరాలు కూడా రావు. ఆకు పసురుకే తగ్గిపోతాయి. ఈడనే మేము ఆరోగ్యంగా ఉండగలమనిపిస్తోంది. బోరు, కరెంటు, రోడ్డు వేసేలా చూడాలి.      – వెంకటేశ్వర్లు, టేకులపెంట గ్రామస్తుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top