పరీక్షలా..జన్మభూమా! | Sakshi
Sakshi News home page

పరీక్షలా..జన్మభూమా!

Published Tue, Oct 7 2014 12:55 AM

teachers are concern on summative-1 exams

ఉపాధ్యాయులకు కొత్త చిక్కు వచ్చింది. సెలవుల్లో సరదాగా గడుపుతున్న టీచర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతుండగా పాఠశాల స్థాయిలో చేయాల్సిన జన్మభూమి-మా ఊరు కార్యక్రమం రోజూవారీ షెడ్యూల్ ప్రకటించారు. రెండూ జరపాల్సిందేనని డీఈవో, ఎస్‌ఎస్‌ఏ పీవోలు ఆదేశాలు ఇచ్చారు. రెండింటినీ ఎలా సమన్వయం చేసుకోవాలిరా దేవుడా అని ఉపాధ్యాయులు అయోమయంలో పడిపోయారు. పరీక్షలైనా వాయిదా వేయాలని లేదా ఉపాధ్యాయులను జన్మభూమి నుంచి మినహాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.            
 
చిత్తూరు(ఎడ్యుకేషన్): జన్మభూమి గురువారం నుంచి ప్రారంభమవుతున్నా పాఠశాలలకు 6వ తేదీ వరకు దసరా సెలవులు ఉండటంతో ఈ నెల 7న మంగళవారం నుంచి పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మంగళవారం నుంచి సమ్మేటివ్-1 పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు 10వ తేదీ వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగుతాయి. ఉన్నత పాఠశాలల విద్యార్థులకు 14వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతాయి. తెలుగు-2, ఇంగ్లిష్-2, ఎన్‌ఎస్-2 పరీక్షలు మధ్యాహ్నం జరుగుతాయి. డీఈవో, ఎస్‌ఎస్‌ఏ అధికారులు జన్మభూమి నేపథ్యంలో ఈనెల 20వ తేదీ వరకు రోజువారీగా చేయాల్సిన కార్యక్రమాల షెడ్యూల్ ఇచ్చారు. పాఠశాల స్థాయిలో కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. వీటిలో ఉపాధ్యాయులు పాల్గొనాల్సి ఉంటుంది.

సమన్వయం కుదురుద్దా?
అధికారులు చెబుతున్న దాని ప్రకారం పరీక్ష అయిన తర్వాత జన్మభూమి కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రజాప్రతినిధులను ఆహ్వానించి కార్యక్రమాలు చేయాలని చెప్పడంతో ఎక్కువగా ఉదయమే జరపాలి. ఉదయం పరీక్షలు ఉంటాయి. రెండూ ఏక కాలంలో చేయడం సాధ్యం కాదు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కార్యక్రమాల ఏర్పాట్లలో బిజీగా ఉంటారు. పరీక్షల షెడ్యూల్ మధ్యాహ్నానికి మార్చుకుంటే లేదా జన్మభూమిలో పాఠశాలలను మినహాయిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం కాబట్టి జన్మభూమి విషయంలో వెనక్కు తగ్గే సూచనలు కనిపించడంలేదు.
 
ప్రభుత్వం ఇబ్బంది పెట్టకుండా చేయాలి
పరీక్షలు, జన్మభూమి కార్యక్రమాలు ఏకకాలంలో జరగడం అసంభవం. ఉపాధ్యాయులు పరీక్షలకు అధిక ప్రాధాన్యత ఇస్తే ప్రజాప్రతినిధుల కోపానికి బలి కావాల్సి ఉంటుంది. పరీక్షలు జరపకపోతే విద్యార్థులు ఇబ్బందులు పడుతారు. ప్రభుత్వం ఆలోచించి షెడ్యూల్ ఇస్తే బాగుంటుంది.

-వీ.రెడ్డిశేఖర్‌రెడ్డి, వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు

Advertisement
Advertisement