
రాజీనామా పత్రాన్ని మంత్రి సునీతకు అందజేసి రోదిస్తున్న జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ
‘మూడేళ్ల పాలనలో పైసా అభివృద్ధి జరగలేదు. ఎక్కడికెళ్లినా అవమానాలే స్వాగతం పలికాయి.
‘అనంత’లో టీడీపీ జెడ్పీటీసీ సభ్యురాలి రాజీనామా
హఠాత్పరిణామంతో అధికార పార్టీలో అలజడి
సర్దిచెప్పేందుకు తీవ్ర ప్రయత్నాలు
అనంతపురం సిటీ: ‘మూడేళ్ల పాలనలో పైసా అభివృద్ధి జరగలేదు. ఎక్కడికెళ్లినా అవమానాలే స్వాగతం పలికాయి. చివరికి పార్టీలో కూడా నేతల సహకారం కొరవడింది. కుల్లు రాజకీయాల నుంచి తప్పుకోవాలని రాజీనామా చేస్తున్నా’ అంటూ అధికార పార్టీకి చెందిన డి.హీరేహాల్ జెడ్పీటీసీ సభ్యురాలు పద్మ ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశంలో ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. రాజీనామా లేఖను తీసుకుని నేరుగా వేదికపైనున్న అధికారులు, మంత్రి పరిటాల సునీత వద్దకు వెళ్తుండగా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు అడ్డుకున్నారు. ఆమెను పక్కకు తీసుకువెళ్లి కారణాలు కనుక్కునే ప్రయత్నం చేశారు.
పార్టీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నానని, తనకు సముచిత స్థానం లేదని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. పూట గడవని కుటుంబంలో జన్మించినా, న్యాయ బద్ధంగా నేటికీ తనూ, తన భర్త ప్రైవేట్ టీచర్‌గా పని చేసుకుని పొట్టపోసుకుంటున్నామన్నారు. అక్రమాలు, అన్యాయం చేయడం తమకు తెలియదన్నారు. మండలంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కావాలని పార్టీలో కొందరు తమను అన్ని విధాలా ఇబ్బంది పెట్టారని చెప్పారు. ఈ విషయం పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లానన్నారు.
అనేక సంవత్సరాలుగా పార్టీ అభివృద్ధికి పాటు పడిన తమ కుటుంబానికి ఎవరూ అండగా నిలువలేదన్నారు. ఈ పరిస్థితితో తమకు న్యాయం జరగక, ప్రజలకూ న్యాయం చేయలేక రాజీనామా చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆమె వివరించారు. ప్రజలను మోసం చేసే ఈ పదవి తనకు అవసరం లేదంటూ ఆమె రాజీనామా లేఖను జిల్లా కలెక్టర్‌కు ఇచ్చేందుకు వెళుతుండగా.. ఎమ్యెల్యే వరదాపురం సూరి, పార్థసారథిలు ఆపే ప్రయత్నం చేశారు. ఇంతలో ఆమె రాజీనామా లేఖను మంత్రి పరిటాల సునీత అందుకున్నారు. గురువారం రాత్రి వరకు ఆమె రాజీనామా విషయంలో వారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిసింది.