విపక్షం గొంతు వినిపించొద్దు..! | TDP to declare not to give chance opposition party in winter sessions | Sakshi
Sakshi News home page

విపక్షం గొంతు వినిపించొద్దు..!

Dec 17 2014 2:53 AM | Updated on Aug 10 2018 9:42 PM

విపక్షం గొంతు వినిపించొద్దు..! - Sakshi

విపక్షం గొంతు వినిపించొద్దు..!

స్వల్ప కాలం పాటు జరగనున్న ఏపీ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ప్రభుత్వ ప్రకటనల తో సరిపుచ్చాలని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది

* ప్రకటనలతో సాగదీద్దాం.. ఎదురు దాడితో ముగిద్దాం
* శాసనసభ శీతాకాల సమావేశాలపై అధికార పక్షం వ్యూహం
* 18 నుంచి 23 వరకే అసెంబ్లీ.. విపక్షం కోరితే మరో రోజు
* అసెంబ్లీలో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

 
సాక్షి, హైదరాబాద్: స్వల్ప కాలం పాటు జరగనున్న ఏపీ రాష్ట్ర శాసనసభ, శాసన మండలి శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పూర్తిగా ప్రభుత్వ ప్రకటనల తో సరిపుచ్చాలని అధికార తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా సభలో చేసే ప్రకటనలు, వాటిపై చర్చ కొనసాగించడంతో సమావేశాలకు ముగింపు పలకాలని అధికార పార్టీ వ్యూహం ఖరారు చేసింది. ఇందులో భాగం గా సీఎం చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్లో రోజుకో ప్రకటన చొప్పున ఐదు ప్రకటనలతో అసెంబ్లీ సమయాన్ని పూర్తిగా తామే వినియోగించుకోవాలని ఎత్తుగడ వేశారు. తద్వారా.. వ్యవసాయ రుణాల మాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, హుద్‌హుద్ సహాయం లో వైఫల్యాలు, రాష్ట్రం లో నెలకొన్న తీవ్రమైన కరవు పరిస్థితులు, రైతుల ఆత్మహత్యలు, పిం ఛన్ల తొలగింపు వంటి సామాజికాంశాలు సాధ్యమైనంత మేరకు చర్చకు రాకుండా చేసి సభను ముగించాలనేది వ్యూహంగా ఉంది. ఇలాంటి అంశాల్లో ప్రతిపక్షానికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా ఇరకాటంలో పడాల్సి వస్తుందని అధికార పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. అవసరమైతే.. రుణ మాఫీ, డ్వాక్రా రుణాలు, ఇసుక విధానం, ఎర్రచందనం విక్రయంవంటి అంశాలను అధికార పక్షం నుంచే ప్రస్తావించి ప్రతిపక్ష పార్టీపై ఎదురుదాడి చేయాలని కూడా టీడీపీ నాయకత్వం నిర్ణయించింది.
 
  ప్రత్యేకంగా కొం దరు ఎంపిక చేసిన నేతలతో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శల దాడి చేయడం ద్వారా.. అసలు అంశాలు చర్చకు రాకుండా పక్కదారి పట్టించాలన్న వ్యూహాన్ని టీడీఎల్‌పీ నేతలు ఖరారు చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. సమావేశాలను 18 నుంచి 23 వరకు జరపాలని, ప్రతిపక్షం డిమాండ్ చేస్తే ఒకే ఒక్క రోజు పొడగించాలని భావించారు. తొలి రోజు సంతాప తీర్మానం పోగా, రెండో రోజు 19న రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆరీడీఏ) బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఇన్‌వాయిస్ ట్రాకింగ్ వ్యవస్థ ఏర్పాటుకు సంబంధించిన వ్యాట్ చట్టంలో సవరణలు చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానే బిల్లును ప్రవేశపెట్టనున్నారు. న్యాయస్థానం అభ్యంతరం నేపథ్యంలో మార్కెట్ కమిటీలు, దేవాలయాలకు చెందిన చట్టాల్లో సవరణలు చేస్తూ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement