తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మైనార్టీ నేతపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటన హవేళిఘణపూర్ శివారులోగల లెప్రసీ ఆస్పత్రి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...మెదక్ పట్టణానికి చెందిన టీడీపీ నేత బొంబాయి ఆరీఫ్‌కు తొగిట పంచాయతీ పరిధిలోని సుల్తాన్‌పూర్ శివారులోగల పాటిగడ్డతండాలో వ్యవసాయ పొలం ఉంది.
శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఆరీఫ్ తనబైక్‌పై మెదక్‌కు వస్తుండగా ఘణపూర్ శివారులోని మూలమలుపులో ఉన్న స్పీడ్ బ్రేకుల వద్ద రెండు బైక్‌లపై వచ్చిన గుర్తుతెలియని దుండగులు అడ్డుకున్నారు. వెంటనే తల్వార్లు, కత్తులతో దాడి చేశారు. ఇదే సమయంలో మెదక్ నుండి ఆటోపై హవేళిఘణపూర్ వైపు వెళ్తున్న కొందరు వ్యక్తులు ఏం జరిగిందంటూ దుండగులను ప్రశ్నించగా, వారిని బెదిరించిన దుండగులు అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో ఆటోలో ఉన్న వ్యక్తులు హవేళిఘణపూర్‌కు వె ళ్లి తాము చూసిన విషయాన్ని పోలీసులకు చెప్పారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రక్తం మడుగులో ఉన్న ఆరీఫ్‌ను, పక్కనే ఉన్న తల్వార్‌ను స్వాధీనం చేసుకున్నారు. వెంటనే ఆరీఫ్‌ను ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించటంతో హైదరాబాద్‌కు తరలించారు.
వాగ్మూలం సేకరణ
దుండగులు చేతిలో తీవ్రంగా గాయపడిన ఆరీఫ్ పరిస్థితి విషమించటంతో న్యాయమూర్తి ప్రదీప్ నాయక్‌ను తీసుకువచ్చిన వాగ్మూలం తీసుకున్నట్లు రూరల్ ఎస్‌ఐ వేణుకుమార్ తెలిపారు.