టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ ! | TDP Main Leaders Between Cold War In Krishna District | Sakshi
Sakshi News home page

టీడీపీ నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ !

Jul 8 2018 12:07 PM | Updated on Aug 10 2018 9:52 PM

TDP Main Leaders Between Cold War In Krishna District - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీలో నాయకుల మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోంది. ముఖ్యంగా పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు తెలుగు యువత నాయకుడు దేవినేని అవినాష్‌ చెక్‌ పెడుతున్నారు. అవినాష్‌కు తన తండ్రి దేవినేని నెహ్రూ వర్గం అండదండలు పుష్కలంగా వుండటంతో పాటు జిల్లాకు చెందిన ఒక కీలక నేత సహాయ సహకారాలు అందిస్తూ ఉండటంతో ఆయన రెండు నియోజకవర్గాల్లోనూ తన వర్గాన్ని బలపరుచుకుంటున్నారు. 

బోడే వ్యతిరేక వర్గానికి అవినాష్‌ అండ!
దేవినేని నెహ్రూ వర్గంలో కీలకంగా వున్న నేతలకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌కు మధ్య పొసగేది కాదు. అవినాష్‌ ఈ నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టిన తరువాత కంకిపాడు, పెనమలూరు ప్రాంతాలకు చెందిన టీడీపీ ముఖ్యనేతలు  అవినాష్‌కు అండగా నిలబడుతున్నారు. అక్కడ ఉన్న కొంతమంది నేతలు నిర్వహించే కార్యక్రమాలకు బోడే ప్రసాద్‌ను ఆహ్వానించినా ఆయన వెళ్లడానికి ఇష్ట పడటం లేదు. దేవినేని అవినాష్‌ ఇటీవల నెహ్రూ వర్ధంతిని నిర్వహించినప్పుడు బోడే ప్రసాద్‌ దూరంగా ఉన్నారు. అవినాష్‌ వెళ్లిపోయిన తరువాత మొక్కుబడిగా వచ్చి వెళ్లారు.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అవినాష్‌ పెనమలూరు నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహించడం బోడేకు రుచించడం లేదు. అవకాశం వస్తే పెనమలూరు నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో దిగేందుకు అవినాష్‌ ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. 

గద్దెకు పొగ...
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌కు అవినాష్‌ పొగపెడుతున్నారు.  ఈ ఇద్దరి మధ్య ఉన్న అంతర్గత విభేదాలు బయటపడకపోయినా ఒకరికి ఒకరు చెక్‌ పెట్టుకునేందుకు తీవ్రంగా పావులు కదుపుతున్నారు. గద్దె వెంట ఉండే వారు అవినాష్‌తో కలవడానికి సిద్ధంగా లేరు. అవినాష్‌ వర్గాన్ని గద్దె పక్కన పెడుతున్నారు. అవినాష్‌ వర్గం చెప్పే పనులను చేయడానికి కూడా గద్దె రామ్మోహన్‌ ఆసక్తి చూపడం లేదని పార్టీలోనే బహిరంగంగానే చర్చ జరుగుతోంది. 

వ్యతిరేక వర్గంతో అవినాష్‌ వర్గం టచ్‌లో....
గద్దె వ్యతిరేకవర్గంతో అవినాష్‌ వర్గం సంప్రదింపులు జరుపుతోంది. 15, 16 డివిజన్లలో అవినాష్‌ వర్గీయులు గద్దెపై గుర్రుగా ఉన్నారు. నేతాజీ బ్రిడ్జి వద్ద బ్యారికేడ్ల సమస్యను పరిష్కరించకపోవడం, మల్లెల తిరుపతమ్మ మార్కెట్‌ సగం కూడా పూర్తికాకపోవడం, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైయిన్‌ పనులు అసంపూర్తిగా వుండటం పై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే పై ఆగ్రహంతో ఉన్నారు. అవినాష్‌ వర్గానికి నియోజకవర్గంలో ఏవిధమైన పదవులు ఇవ్వకుండా ఎమ్మెల్యే జాగ్రత్త పడుతున్నారు. దీంతో  గద్దెరామ్మోహన్‌ పై తిరుగు బావుటా ఎగరవేయాలని అవినాష్‌ వర్గం భావిస్తోంది. ఆదే విషయాన్ని  ఐటీ మంత్రి నారా లోకేష్‌ దృష్టికి కూడా కొంతమంది నాయకులు తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో కార్యకర్తలు సీరియస్‌గా వున్నారు.  తన తండ్రి నియోజకవర్గమైన విజయవాడ తూర్పు నియోజకవర్గంపై అవినాష్‌ కన్నేసి అక్కడ నుంచి పోటీకైనా సై అంటున్నారు. అందుకోసం నియోజకవర్గంలోని తన తండ్రితో కలిసి పనిచేసిన వారితో అవినాష్‌ విడతల వారీగా చర్చలు జరుపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement