29న టీడీపీ శాసనసభాపక్ష సమావేశం

TDP Legislative Assembly Meeting on 29th - Sakshi

శాసనసభా పక్షనేతను ఎన్నుకునే అవకాశం 

మహానాడు స్థానంలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమాలు 

సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం ఈ నెల 29వ తేదీన నిర్వహించేందుకు ఆ పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతను ఎన్నుకోనున్నారు. ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమితో  ప్రతిపక్ష నేత బాధ్యతలు తీసుకునేందుకు సైతం చంద్రబాబు వెనకాడుతున్న నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎన్నుకుంటారనే దానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి గెలిచిన పయ్యావుల కేశవ్‌ పేరు పరిశీలనలో ఉందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే చంద్రబాబు కాదంటేనే ఆయనకు ఈ అవకాశం దక్కుతుందంటున్నారు. చంద్రబాబు ఆ పాత్రను పోషించేందుకు సిద్ధమైతే పయ్యావులకు డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌గా అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తున్నా రెండు పదవులు ఒకే సామాజికవర్గానికి దక్కినట్లవుతుందనే తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడి పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. మరోవైపు శాసనసభాపక్ష సమావేశాన్ని ఎక్కడ నిర్వహించాలనే దానిపై టీడీపీ నాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. గుంటూరు టీడీపీ కార్యాలయంలోగాని, మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్స్‌లోగాని నిర్వహించే అవకాశం ఉంది. 

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మహానాడు స్థానంలో ఎన్టీఆర్‌ జయంతి కార్యక్రమం
ప్రతి సంవత్సరం మే 27వ తేదీ నుంచి మూడురోజులపాటు నిర్వహించే పార్టీ మహానాడును ఈసారి రద్దుచేస్తూ ఫలితాలకు ముందే చంద్రబాబు నిర్ణయించారు. ఓటమి ఛాయలు ముందే పసిగట్టి తెలివిగా మహానాడును రద్దు చేసి గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో 28వ తేదీన ఎన్టీఆర్‌ జయంతిని నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top