ఎర్రచందనం అక్రమరవాణాకు పచ్చ కార్పెట్‌

TDP Leaders Sandlewood Smuggling - Sakshi

పెచ్చుమీరిన ఎర్రచందనం అక్రమ రవాణా

దీనివెనుక అధికార పార్టీ నేతలు

పోలీసులు తమ వంతు మద్దతు

అమాయకులపై అక్రమ కేసులు బనాయింపు

ఎన్నికల వ్యయానికి నేతల ముందుచూపు

అధికారపార్టీ నేతలు అక్రమార్జనే పనిగా పెట్టుకున్నారు. ఇందుకోసం ఏ అవకాశాన్నీ వదులు కోవడం లేదు. కొందరు     ఎర్రచందనం అక్రమ రవాణాను ఎంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ కార్యకలాపాలను పెంచేశారు.  పోలీసు అధికా రుల మద్దతుతో రెచ్చిపోతున్నారని తెలిసింది. స్మగ్లర్ల ముసుగులో ఎర్రబంగారాన్ని సరిహద్దులు దాటిస్తున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. తద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇటీవల జరిగిన సంఘటనలే ప్రబలసాక్ష్యాలు.

సాక్షి, తిరుపతి: జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాలో టీడీపీ నాయకుల పాత్ర అధికంగా కనిపిస్తోంది.  కురబలకోట పరి«ధిలో ఇటీవల 170 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. సుమారు రూ.3 కోట్లు విలువచేసే దుంగలు ఒకేసారి పట్టుబడటం వెనుక కొందరు పోలీసుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పట్టుబడ్డ ఎర్రచందనం లారీకి ఎస్కార్ట్‌ ఓ పోలీసు వాహనం వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్పీ దృష్టిలో తాము బాగా పనిచేస్తున్నామనిచెప్పుకునేందుకు ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఒకేసారి అన్ని విలువైన దుంగలు పట్టుబడ్డటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా కొందరు పోలీసులు పనికట్టుకుని ఏర్పాటు చేసిందేనని భోగట్టా. దుంగలన్నీ టీడీపీ నేతలు, పోలీసులు కలిసి దాచిపెట్టిన వాటిలో కొన్ని మాత్రమేనని తెలిసింది. డంప్‌చేసిన ఎర్రచందనంలో 25శాతం దుంగలే.

ఎర్రావారిపాళెం చెరుకువారిపల్లి పరిధిలో 15 రోజుల క్రితం పట్టుబడిన స్మగ్లర్లను విచారిస్తే చిన్నగొట్టిగల్లుకు చెందిన ఇద్దరు టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించినట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులకు ఫోన్‌ కాల్స్‌ రావడంతో ఆ ఇద్దరినీ విచారణ నుంచి మినహాయించారు. స్మగ్లర్లను విడిచిపెట్టకుండా పీలేరు సబ్‌జైలుకు తరలించారు. వారిని విడిచిపెడితే టీడీపీ నేతల పేర్లు బహిర్గతమవుతాయని ఇలా చేసినట్లు తెలిసింది.
ఎర్రావారిపాళెం మండలంలో 13 రోజుల క్రితం ఎర్రచందనం అక్రమ రవాణాకు ఎస్కార్ట్‌గా వెళుతున్న ఇన్నోవా కారును అధికారులు పట్టుకున్నారు. కారు యజమాని అధికార పార్టీ నేత. అతను పలుకుబడిని ఉపయోగించి కేసు నుంచి తప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. అందరికీ తెలిసిపోయిందని, తామేమీ చేయలేమని పోలీసులు చేతులెత్తేసినట్లు తెలిసింది. చివరికి కారు ఇవ్వకపోయినా ఫర్వాలేదని, కేసులో లేకుండా చేయమని ఒత్తిళ్లు చేయించినట్లు తెలిసింది. బహుమతిగా ఆ కారును తీసుకోమని పోలీసులకు ఆఫర్‌ చేసినట్లు సమాచారం. కారు విషయం గానీ, ఆ వాహనం యజమానిపై ఎక్కడా కేసు నమోదు కాకపోవటంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
శేషాచలం అటవీ సరిహద్దు మండలాలు టీడీపీ నేతల ఎర్రచందనం వ్యాపారానికి కేరాఫ్‌గా మార్చుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కొంతకాలంగా పీలేరు, ఎర్రావారిపాళెం, బాకరా పేట, చిన్నగొట్టిగల్లు వైపు దృష్టి సారించటం లేదు. ఇందుకు టీడీపీ నేతల ఒత్తిళ్లే కారణమని తెలిసింది.
కొంతకాలంగా పీలేరు రూరల్‌ సర్కిల్‌ (భాకరాపేట) పరిధిలో కొంతమంది ఆటోడ్రైవర్లు, వివిధ వాహనాల డ్రైవర్లు రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తున్నారు. ఇందులో ఎర్రచందనం దుంగలను సరిహద్దు దాటిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. పోలీసులు రూట్‌ క్లీయర్‌ చేసి పంపుతున్నట్లు సమచారం.

తూతూ మంత్రంగా అమాయకులపై కేసులు ....
ఎర్రచందనం రవాణాలో ఎవరైనా పట్టుబడితే వారు ఎవరు? ఏ పార్టీకి చెందిన వారు? అని విచారించిన మీదటే కేసు నమోదు చేయాలా? వద్దా? అనే నిర్ణయం తీసుకుంటున్నారు. అధి కార పార్టీకి చెందిన వారైతే విడిచిపెడుతున్నారని భోగట్టా. వారి స్థానంలో అమాయకులను తీసుకొచ్చి కేసులు నమోదు చేయడం పరిపాటిగా మారిందనే ఆరోపణలున్నాయి. ఈ మధ్య పీలేరు రూరల్‌ సర్కిల్‌ పరిలో పట్టుబడిన వారిని తప్పించి అమాయకులను తీసుకొచ్చి కేసులుపెడుతున్నారని తెలిసింది. ఎవరైనా పట్టుబడినట్లు బయటకు తెలిస్తేనే మీడియాకు తెలపాలని కొందరు పోలీసులు కిందిస్థాయి వారికి హుకుం జారీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పట్టుబడ్డ వారిలో అధికార పార్టీ వారు అయితే సంబంధిత టీడీపీ నాయకుడికి చెప్పి పంపించమని ఆదేశాలున్నట్లు చెబుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top