రాజకీయ దురుద్దేశం

TDP leaders Sand Mining Mistreating In East Godavari - Sakshi

రాజకీయ దురుద్దేశమే కారణం

అధికారంలో ఉండగా దోచేశారు

సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తున్నారు. తాము అధికారంలో ఉండగా గోదావరితోపాటు వాగులు, వంకలు కూడా వదిలిపెట్టకుండా ఇసుకను దోచేసిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు ఇసుక రాజకీయాలు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇసుక అందరికీ తక్కువ ధరకు అందాలన్న ఉద్దేశంతో కొత్త ఇసుక పాలసీని రూపొందించి వచ్చే నెల ఐదు నుంచి అమలు చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో తెలుగుదేశం నాయకులు ఇసుక కొరత ఉందంటూ ధర్నాలకు దిగారు. గత ఐదేళ్లలో ఎవరైతే దోచుకున్నారో వారే ఇప్పుడు ఇసుక ధర్నాలకు దిగడం విమర్శలకు దారితీస్తోంది. ఐదు నుంచి వచ్చే పాలసీ తమ వల్లే వచ్చిందని చెప్పుకుంనేందుకు ఈ ఇసుక రాజకీయానికి తెరలేపారు.  

ఇసుక కొల్లగొట్టిన తెలుగుతమ్ముళ్లు 
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తెలుగుతమ్ముళ్లు మాఫియాగా ఏర్పడి  ప్రభుత్వ సంపదను కొల్లగొట్టారు. అధికార పార్టీ నేతల అండదండలతో చెలరేగిపోయారు. అధికారులను, ఉద్యోగులను ఏమాత్రం లెక్కచేయలేదు. ఇసుక అక్రమాలను అడ్డుకున్న ముసునూరు తహసీల్దార్‌ వనజాక్షిపై అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. తమ్మిలేరును పూర్తిగా చింతమనేని కొల్లగొట్టారు. మరోవైపు గోదావరి తీరంలో ఇసుక మాఫియా పేట్రేగిపోయింది.  ప్రకృతి వనరులైన ఇసుక, మట్టిని అక్రమంగా తవ్వుతూ కోట్లాది రూపాయలను  లూటీ చేసింది. గోదావరి తీరంలో ఉన్న పోలవరం, కొవ్వూరు, నిడదవోలు, ఆచంట ప్రజాప్రతినిధులు రూ.కోట్లకు పడగలెత్తారు. 

ఆది నుంచీ అంతం వరకూ దోపిడీనే
గత ప్రభుత్వం ఆది నుంచి అంతం వరకూ ఇసుక దోపిడీ సాగిస్తూనే వచ్చింది. ర్యాంపుల నిర్వహణను డ్వాక్రా సంఘాలకు అప్పగించినప్పుడు మాఫియాకు చెందిన వ్యక్తులు పెద్దఎత్తున అక్రమంగా ఇసుక తరలించి జేబులు నింపుకున్నారు. అధికారిక ర్యాంపులకు కూతవేటు దూరంలోనే అనధికార ర్యాంపు ఏర్పాటు చేసి యథేచ్ఛగా తవ్వకాలు సాగించారు. పగలూరాత్రి తేడా లేకుండా పెద్దఎత్తున ఇసుక అక్రమంగా తరలించారు. తర్వాత ఉచిత ఇసుక పాలసీని అడ్డం పెట్టుకుని తెలుగుదేశం నాయకులే ర్యాంపులను నడిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇసుకను ఉచితంగా ఇవ్వాలి. ఇసుకను యంత్రాల ద్వారా తవ్వి వాహనంలో లోడింగ్‌ చేసినందుకు మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా దానికి విరుద్ధంగా వేలాది రూపాయలు వసూలు చేశారు.

అధిక వసూళ్లు, అడ్డగోలు తవ్వకాలు సాగుతున్నా అధికార పార్టీ నాయకుల బెదిరింపుల వల్ల అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడలేదు. పర్యావరణ అనుమతులు లేకుండానే చాలా ర్యాంపుల్లో ఇసుక తవ్వకాలు జరిగాయి.  పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద గోదావరి నదిలో ఇసుక తవ్వకూడదని సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీడబ్ల్యూసీ) హెచ్చరికలు జారీ చేసినా అక్కడే తవ్వేశారు. ఉచిత ఇసుక విధానంలో స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను వాడుకోవాల్సి ఉండగా, ఇతర రాష్ట్రాలకు కూడా తరలించేశారు. 

ఇసుక మాఫియాకు కొత్త ప్రభుత్వం అడ్డుకట్ట 
ఇప్పుడు వైఎస్సార్‌ సీపీ  ప్రభుత్వం  ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకు పారదర్శక విధానాలతో ముందుకు వచ్చింది. ప్రతి రీచ్‌లోనూ యూనిట్‌ ధరను నిర్ణయించి అమ్మకాలు చేస్తోంది. వచ్చేనెల ఐదు నుంచి పూర్తిస్థాయి ఇసుక పాలసీని అమలులోకి తీసుకురానుంది. ఈనెలలో గోదావరి వరదల వల్ల ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. దీన్ని సాకుగా చూపించి తెలుగుదేశం నాయకులు ఇసుక కొరత ఉందంటూ ఆందోళనకు దిగారు. గతంలో ఎవరైతే ఇసుక మాఫియాకు అండదండగా నిలిచారో వారే శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. ఏలూరు, నరసాపురం, పాలకొల్లు, తణుకు, భీమవరం తదితర ప్రాంతాల్లో ధర్నాలు నిర్వహించారు. ఈ ధర్నాల్లో పాల్గొని అల్లకల్లోలం సృష్టించేందుకు యత్నించిన  చింతమనేని ప్రభాకర్‌ను పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. పాలకొల్లు ఎమ్మె ల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామమోహనరావు, నరసాపురం మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top