టీడీపీ హయాంలో ట్రాక్టర్లను మింగేశారు..

TDP leaders Irregularities in Chittoor District - Sakshi

సబ్సిడీ యంత్రాలు స్వాహా చేసిన టీడీపీ నేతలు  

జన్మభూమి కమిటీల సహకారం

పేరుకే రైతులకు, సర్వహక్కులు వారివే 

ప్రశ్నిస్తే దౌర్జన్యాలు.. ఆందోళనలో లబ్ధిదారులు 

గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకుల అక్రమాలకు అంతే లేదు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు రథం పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లను కూడా అక్రమంగా స్వాహా చేశారు. పలువురు టీడీపీ నాయకులు ఎస్సీ, ఎస్టీ రైతుల పేరుతో రాయితీ  ట్రాక్టర్లను మంజూరు చేసుకుని యథేచ్ఛగా దోచుకున్నారు. టీడీపీ జిల్లా స్థాయి నాయకుడు ఏకంగా రెండు ట్రాక్టర్లు, ఓ ఎమ్మెల్సీ రెండు ట్రాక్టర్లను ఎస్సీ రైతుల పేరుతో మంజూరు చేసుకుని వారి సొంత క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో వాడుకుంటున్నారు.  

కలికిరి మండలం కె.కొత్తపల్లెలోని యేసుప్రభు రైతు మిత్ర సంఘం రైతులు 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌కేవీవై (రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన) ద్వారా 75 శాతం రాయితీతో ట్రాక్టర్, మల్టీక్రాప్‌ ప్లాంటర్‌ (రొటోవేటర్‌), విత్తనం వేసే మడకలు తదితరాల మంజూరు కోసం  ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ అభ్యర్థన మేరకు వారికి ట్రాక్టర్, ఇతర యంత్రాలు మంజూరయ్యాయి. అయితే ఆ విషయం లబ్ధిదారులైన రైతులకు తెలియకుండా నేరుగా ఆ మండల టీడీపీ నాయకుడు మంజూరు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో అసలు విషయం లబ్ధిరులకు తెలిసింది. దీనిపై టీడీపీ నాయకున్ని వారు ప్రశి్నస్తే సరైన సమాధానం చెప్పలేదు. కనీసం మంజూరైన ట్రాక్టర్‌ కూడా అతని వద్ద లేకపోగా ఇతరులకు అమ్ముకుని సొమ్ముచేసుకున్నట్లు రైతులు గుర్తించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వారు ప్రయత్నించగా వారిని ఆ నాయకుడు బెదిరిస్తున్నాడు. 

సాక్షి, చిత్తూరు ‌: వ్యవసాయంలో యాంత్రికీకరణను ప్రతి రైతు వినియోగించాలని అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలియజేశాయి. అందుకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆర్‌కేవీవై పథకం ద్వారా ప్రతి ఐదుగురు రైతులతో కూడిన రైతు సంఘాలకు ఒక యూనిట్‌ కింద ట్రాక్టర్, రొటోవేటర్, విత్తనాలు వేసే మడకలు తదితరాలను 75 శాతం రాయితీతో మంజూరు చేసింది. ఇందుకుగాను మొత్తం యూనిట్‌ విలువ రూ.8.60 లక్షలకు  రాయితీ కింద రూ.6.02 లక్షలు ప్రభుత్వం చెల్లించగా, మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లించేలా పథకాన్ని అమలు చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా 2015–16 ఏడాదిలో మొత్తం 470 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.  

టీడీపీ నాయకుల చేతివాటం 
గత ప్రభుత్వ హయాంలో ఏ పథకాన్ని అమలు చేయాలన్నా జన్మభూమి కమిటీల పాత్రే కీలకంగా ఉండేది. దీంతో ఆర్‌కేవీవై కింద మంజూరైన ట్రాక్టర్‌ యూనిట్‌ను పొందేందుకు ముందస్తుగా రైతులు జన్మభూమి కమిటీలకే దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నాయకులు జన్మభూమి కమిటీ సభ్యుల సహకారంతో రైతు సంఘాల నుంచి సంతకాలు చేసిన దరఖాస్తులు, వాటికి జతచేయాల్సిన పత్రాలను సేకరించారు. తరువాత లబ్ధిదారులకు తెలియకుండానే ట్రాక్టర్‌ యూనిట్‌ను మంజూరు చేసుకున్నారు. ప్రతి యూనిట్‌పై రూ.6 లక్షల మేరకు రాయితీ రావడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా అమ్మి సొమ్ము చేసుకున్నారు. తీరా లబ్ధిదారులకు విషయం తెలిసి టీడీపీ నాయకులను ప్రశ్నిస్తే సమాధానం చెప్పకపోగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.  చదవండి: జేసీ ప్రభాకర్‌ రెడ్డిపై పీటీ వారెంట్ 

నిబంధనలు ఇలా.. 
ఆర్‌కేవీవై కింద రైతు సంఘాలు పొందిన ట్రాక్టర్లను కనీసం 5 ఏళ్ల కాలం వరకు ఎవరికి గాని విక్రయించకూడదు. అలా విక్రయించినట్లు అధికారుల విచారణలో తేలితే లబ్ధిదారుల నుంచి రాయితీ మొత్తాలను వసూలు చేస్తారు. ఒకవేళ రైతులు కట్టకపోతే ఆఖరికి కేసులు పెట్టే అవకాశం ఉంది. దీంతో పలువురు రైతులు ట్రాక్టర్‌ యూనిట్లు పొందకపోయినా అధికారిక లెక్కల్లో పొందినట్లు నమోదై ఉన్నాయి. దీంతో ఎవరైనా అధికారులు విచారణ చేపడితే ఆఖరికి రైతులు దోషులుగా నిలబడాల్సిన దుస్థితి ఏర్పడింది. దీంతో కొందరు రైతులు అక్రమంగా ట్రాక్టర్లను మంజూరు చేసుకున్న వారిపై కేసులు పెట్టేందుకు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై సంబంధిత అధికారులు ముందస్తుగానే విచారణ చేపట్టి అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

రైతు రథంలోనూ.. 
రైతు రథం పధకం ద్వారా రైతులకు అందాల్సిన రాయితీ ట్రాక్టర్లు కేవలం టీడీపీ నాయకులకే పరిమితమైపోయాయి. రైతు రథం కింద ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షల మేరకు అప్పటి ప్రభుత్వం రాయితీ కల్పించింది. జిల్లాలో మొత్తం 1,047 ట్రాక్టర్లు మంజూరయ్యాయి. ఈ ట్రాక్టర్లను టీడీపీ జిల్లా నాయకుడు, ఓ ఎమ్మెల్సీ ఏకంగా రెండేసి ట్రాక్టర్లను ఎస్సీ రైతుల పేరుతో మంజూరు చేసుకున్నారు. దీనిపై ఇటీవల కలెక్టరేట్‌లో జరిగిన జిల్లాస్థాయి సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించిన విషయం విదితమే. ఈ పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లు ఎక్కడగాని రైతులకు అందిన దాఖలాలు లేవు. 

విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం 
రైతుల సౌకర్యార్థం ఆర్‌కేవీవై కింద రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్లు అక్రమంగా ఇతరుల వద్ద ఉన్నట్లు గుర్తిస్తే తగు చర్యలు తీసుకుంటాం. ఇందుకోసం అందరు ఏఓలను అప్రమత్తం చేసి విచారణ చేపడతాం. ఎక్కడైనా రైతులకు చెందాల్సిన ట్రాక్టర్లను ఇతరులు అక్రమంగా అనుభవిస్తుంటే ఆయా మండల ఏఓల దృష్టికి తీసుకువస్తే విచారణ చేపడతాం.  –విజయ్‌కుమార్, వ్యవసాయశాఖ జేడీ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top