తిరుమలలో ‘టీడీపీ’ హైడ్రామా

TDP Leaders High Drama In Tirumala - Sakshi

సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు ఉద్యోగుల వరుస దీక్షలు, ధర్నాలు

పరిష్కరిస్తామని  హామీ ఇచ్చి దీక్షలు 

విరమింపజేసిన టీడీపీ నేతలు

పాలకమండలి సమావేశంలో చర్చకు రాని సమస్యలు 

తిరుమల, తిరుపతిలో ఉద్రిక్తత..పలువురి అరెస్ట్‌

సాక్షి, తిరుపతి: తిరుమల స్థానికులు.. టీటీడీ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారం విషయంలో టీడీపీ నేతలు ఆడిన హై డ్రామా సీన్‌ రివర్స్‌ అయ్యింది. ఐదేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ వాయిదా వేస్తూ వచ్చిన టీటీడీ పాలకమండలి మంగళవారం జరిగిన సమావేశంలోనూ తమ సమస్యలపై చర్చించకుండా ముగించడంపై తిరుమల వాసులు ఆగ్రహం వ్యక్తం చేసి పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. టీటీడీ చైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ని ఘెరావ్‌ చేస్తూ నినాదాలు చేశారు. అలాగే మంగళవారం ఉదయం తిరుపతి పరిపాలన భవనం వద్ద టీటీడీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళన కూడా ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. టీడీపీ నేతల తీరు వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళనకారులు ధ్వజమెత్తారు. టీటీడీలో మొత్తం 14,370 మంది కాంట్రాక్టు కార్మికులు ఉన్నారు. ఏళ్లు గడుస్తున్నా వేతనాలు పెంచలేదని పలుమార్లు టీటీడీ అధికారులు, పాలకమండలి సభ్యులు, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో తిరుపతిలో గత కొద్దిరోజులుగా దీక్షలు చేస్తున్నారు.  మంగళవారం జరుగనున్న పాలకమండలి సమావేశంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. అయితే అజెండాలో ఆ ప్రస్తావనే లేదని తెలిసి పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. పరిపాలన భవనంలోకి అధికారులెవ్వరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులను ఈడ్చుకుంటూ తీసుకెళ్లి అరెస్టు చేశారు.  

చైర్మన్‌ను అడ్డుకున్న తిరుమల స్థానికులు
తిరుమలలో మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా గొల్లకిష్టయ్య సందు, వరాహస్వామి ఆలయం వద్ద, దక్షిణ మాడవీధుల్లో నివాసం, దుకాణాలను తొలగించారు. నిరాశ్రయులైన స్థానికులు పునరావాసం, పరిహారంతో పాటు హాకర్స్‌ అనుమతుల కోసం పదేళ్లుగా పాలకుల చుట్టూ తిరుగుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి కేవలం రెండునెలల సమయం ఉండడం, పాలకమండలి సమావేశం ఇదే చివరిది అవుతుందని బాధితులు పాలకులపై ఒత్తిడి తెచ్చారు. సమావేశంలో చర్చించి న్యాయం చేయమని సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ నివాసంలో ఆందోళనకారులు చర్చలు జరిపారు. చేసేది లేక ఎమ్మెల్యే చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌తో కలిసి అన్నమయ్య భవన్‌లో జరుగుతున్న టీటీడీ పాలకమండలి సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి హై డ్రామాకు తెరతీశారు. కొంత సమయం నడచిన హైడ్రామా అనంతరం పాలకమండలి సమావేశం యధావిధిగా నడిచింది. సమావేశంలో తిరుమల స్థానికుల సమస్యలు చర్చకే రాలేదని, బడ్జెట్‌ చర్చతోనే ముగించారని తెలుసుకున్న స్థానికులు ఆందోళనకు దిగారు. సమావేశం నుంచి బయటకు వెళుతున్న చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ని అడ్డుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా సమ్మె బాట పట్టేందుకు కార్యాచరణ రూపొందించనున్నట్లు ఆయా కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు.

సంబంధం లేనట్టు వ్యవహరించిన ఉన్నతాధికారులు
టీటీడీ పాలకమండలి సమావేశం పూర్తయ్యాక తమకు ఎటువంటి సంబంధం లేనట్లు ఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు వ్యవహరించారని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. పాలకమండలిలో బడ్జెట్‌ కేటాయింపు వివరాలు మీడియాకు వివరించాల్సి ఉన్నా... ఇరువురు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. ఆంగ్లంలో ఉన్న బడ్జెట్‌ వివరాలు చదవడంలో చైర్మన్‌ సుధాకర్‌యాదవ్‌ తీవ్ర ఇబ్బంది పడ్డారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top