మావాడే కావాలి.. మా కోసమే ఉండాలి

TDP Leaders focus on ci Postings  - Sakshi

సీఐల పోస్టింగ్‌పై అధికార పార్టీ ప్రజాప్రతినిధుల పంతం

ప్రధానంగా ఆరు పోస్టింగ్‌లపై పట్టు

ట్రాక్‌ రికార్డు చూసి ఇద్దామంటున్న పోలీస్‌ అధికారులు

రెండు నెలలుగా పెండింగ్‌లోనే ప్రతిపాదనలు

విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో సీఐల నియామకంపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు పంతం పట్టారు. తమకు అనుకూలంగా ఉన్న వారినే నియమించాలని భీష్మించారు. పోలీస్‌ వ్యవస్థను గాడినపెట్టేందుకు సమర్థులను నియమిద్దామని ఆ శాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా ప్రజాప్రతినిధులు మాత్రం ససేమిరా అంటున్నారు.

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ కమిషనరేట్‌ పరిధిలో సీఐల బదిలీల అంశం ఉన్నతాధికారులు, టీడీపీ ప్రజాప్రతినిధుల మధ్య ఆధిపత్యపోరుకు వేదికగా మారింది. పోలీసు వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఉన్నతాధికారులు చేసిన ప్రతిపాదనలకు ప్రజాప్రతినిధులు ససేమిరా అంటున్నారు. పూర్తిగా తమకు అనుకూలమైన అధికారులే ఉండాలని నగరంలోని ప్రజాప్రతినిధులు పట్టుబడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సమర్థులైన అధికారులను రాజధానిలో నియమించాలని అధికారులు ప్రతిపాదించారు. ఈ వ్యవహారం సంక్లిష్టంగా మారడంతో రెండు నెలలుగా సీఐల బదిలీల ప్రక్రియ పెండింగులో చిక్కుకుంది.

ఆ ఆరింటిపైనే పీటముడి
కమిషరేట్‌ పరిధిలోని ఆరు పోలీసు స్టేషన్లలో సీఐ పోస్టింగుల అంశంలో పీటముడి బిగుసుకుంటోంది. పటమట, అజిత్‌సింగ్‌ నగర్, గన్నవరం పోలీసు స్టేషన్లలో సీఐల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ మూడు పోలీస్‌ స్టేషన్లలో అధికారులు వివాదాస్పద రీతిలో వైదొలగడం గమనార్హం. కీలకమైన ఈ పోలీస్‌స్టేషన్లలో తమకు అనుకూలమైనవారే ఉండాలని ప్రజాప్రతినిధులు తేల్చిచెబుతున్నారు. అందు కోసం ముగ్గురు టీడీపీ ప్రజాప్రతినిధులూ తమకు అనుకూలమైన అధికారుల పేర్లు సూచించారు.

 నగరంలో వాణిజ్య ప్రాంతంలో  వివాదాస్పదమైన ఓ ప్రజాప్రతినిధి తన పరిధిలోనే ఉన్న ఓ అధికారిని అజిత్‌సింగ్‌నగర్‌ సీఐగా నియమించాలని సిఫార్సు చేశారు. శివారు ప్రాంతాల్లో దందాలకు పాల్పడే మరో ప్రజాప్రతినిధి గన్నవరం సీఐగా ఓ వివాదాస్పద అధికారి పేరు సూచించారు. ప్రస్తుతం నగర పరిధిలో ఉన్న ఆయన పనితీరుపై ప్రతికూల నివేదికలే ఉన్నాయి. సౌమ్యుడిగా కనిపిస్తూ పెద్దపెద్ద సెటిల్‌మెంట్లు చేసే మరో ప్రజాప్రతినిధి తీరు అదే విధంగా ఉంది. క్రైం రేటు అధికంగా ఉండే పటమట సీఐ పోస్టు కోసం తన నియోజకవర్గ పరిధిలోని ఓ అధికారిని సిఫార్సు చేశారు.

మరో ముడు పోలీస్‌స్టేషన్లలో సీఐల పోస్టింగుల వ్యవహారం కూడా సంక్లిష్టంగా మారింది. కంకిపాడు, పెనమలూరు, విజయవాడ సత్యన్నారాయణపురం పోలీస్‌స్టేషన్లలో ప్రస్తుత సీఐలను కూడా బదిలీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆ పోస్టుల కోసం టీడీపీ ప్రజాప్రతినిధులు తమ అనుకూల అధికారుల పేర్లను సిఫార్సు చేశారు.  

వారికి ఇవ్వలేం...
ప్రజాప్రతినిధులు సిఫార్సు చేసిన అధికారుల పేర్లపై పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆ అధికారుల ట్రాక్‌ రికార్డు సరిగాలేదన్న అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతం కమిషనరేట్‌ పరిధిలో ఉన్న వారినే ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించడం వల్ల ప్రయోజనం ఉండదని కూడా చెబుతున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న సమర్థులైన అధికారులను నియమిస్తే పోలీసింగ్‌ను పటిష్ట పరచవచ్చని అంటున్నారు. ఈ మేరకు ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో పనిచేసున్న కొందరు అధికారులపేర్లతో ఓ జాబితా రూపొందించి ఉన్నతాధికారులకు సమర్పించినట్లు సమాచారం.

బదిలీల ప్రక్రియకే బ్రేక్‌...!?
తమ సిఫార్సులకు విరుద్ధంగా సీఐల బదిలీల జాబితా రూపొందించడంపై ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. తాము చెప్పినట్లే బదిలీలు చేయాలని హోమంత్రిత్వ శాఖ స్థాయిలో చెప్పించారు. ఈ మేరకు ఉన్నతాధికారి తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హోంమంత్రిత్వశాఖ పెద్దలు కూడా ప్రజాప్రతినిధులకే పరోక్షంగా మద్దతు తెలపడం గమనార్హం. రాజధానిలో పోలీసు వ్యవస్థను సంస్కరించేందుకే ప్రయత్నిస్తున్నామని ఉన్నతాధికారి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా ఫలితంలేదని సమాచారం.

దీంతో సీఐల బదిలీల ప్రకియనే పెండింగులో ఉంచేశారు. దాదాపు రెండు నెలలు కావస్తున్నా సీఐల బదిలీలకు ఆమోదముద్ర వేయలేదు. రాజధానిలో కీలకమైన మూడు పోలీస్‌స్టేషన్లలో రెగ్యులర్‌ సీఐలు లేక పోలీసింగ్‌ గాడితప్పుతున్నా పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తాము సూచించినట్లుగా బదిలీల జాబితాలో మార్పులు చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో సీఐల బదిలీల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. మరి ట్రాక్‌ రికార్డుకు పెద్దపీట వేస్తారో... ప్రజాప్రతినిధుల అనుకూల అధికారులకు పచ్చజెండా ఊపుతారో వేచిచూడాల్సిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top