ఇక ఆలయాలపై పచ్చ నేతల కర్రపెత్తనం

TDP Leaders Domination On Appointment Temples Committees In Andhra Pradesh - Sakshi

వెయ్యి గుళ్లలో పాలకమండళ్ల నియామకానికి ఒకేరోజు నోటిఫికేషన్‌ 

ఎన్నికల ముందు సర్కారు కసరత్తు

దేవదాయ సిబ్బంది లేని ఆలయాలకూ పాలకమండళ్లు

రాష్ట్రంలో 22 వేలకుపైగా ఆలయాలు ఉంటే 4,459 గుళ్లలోనే సిబ్బంది

పాలకమండళ్లు మాత్రం 5,052 ఆలయాలకు..

సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని గుళ్లనూ అధికార పార్టీ నేతలకు పంచిపెట్టబోతోంది. గ్రామాల్లోని టీడీపీ నేతలకు గుళ్లపై కర్రపెత్తనం అప్పగించేందుకు వీలుగా వెయ్యి గుళ్లకు పాలకమండళ్లను నియమించడానికి గత శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. రాష్ట్ర దేవదాయ శాఖ పరిధిలో 22 వేలకు పైగా ఆలయాలు ఉన్నప్పటికీ.. ఆదాయం లేదన్న సాకుతో వేలాది ఆలయాల్లో ప్రభుత్వం కనీసం దేవదాయ శాఖ సిబ్బందిని కూడా నియమించలేదు. ఆదాయం బాగా ఉండే 4,459 ఆలయాల్లో మాత్రమే కార్యనిర్వాహక అధికారులు (ఈవోలు)/గుడి మేనేజర్లను నియమించింది. వీటిలో మాత్రమే దేవదాయ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. కానీ ఈ 4,459 ఆలయాలతో కలిపి మొత్తం 5052 ఆలయాలకు పాలకమండళ్లను నియమించాలని నిర్ణయించడం గమనార్హం. ఇప్పటికే వీటిలో 1955 ఆలయాలకు పాలకమండళ్లను నియమించింది. తాజాగా గత శుక్రవారం నోటిఫికేషన్‌ జారీ చేసిన వెయ్యి ఆలయాలు కలిపి మొత్తం 1201 ఆలయాలకు నియామక ప్రక్రియ పురోగతిలో ఉంది. మిగిలిన ఆలయాల్లోనూ పాలకమండళ్ల నియామకానికి దేవదాయ శాఖ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తోంది. 

నాలుగున్నరేళ్లుగా దార్మిక పరిషత్‌ ఏర్పాటే లేదు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం కంటే హిందూ మతంపై పూర్తి విశ్వాసం ఉండే రిటైర్డ్‌ న్యాయమూర్తులు, ఆలయాలకు భారీ దానాలిచ్చే దాతలు, మఠాధిపతులు, స్వామీజీల పెత్తనంలో దేవదాయ శాఖ ఉండాలనే ఉద్దేశంతో 2007లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. దేవదాయ శాఖ మంత్రితోపాటు మొత్తం 27 మంది సభ్యులుండే ధార్మిక పరిషత్‌ చెప్పిన ప్రకారమే దేవదాయ శాఖ పనిచేయాల్సి ఉంటుంది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)తోపాటు అన్ని ఆలయాల్లో నిత్య పూజా కైంకర్యాలతోపాటు జమాఖర్చులపై పూర్తి పర్యవేక్షణ, పాలక మండళ్ల నియామకం వంటి వాటిపై ధార్మిక పరిషత్‌ చేసే సూచనలే శిరోధార్యం. అయితే.. చంద్రబాబు ప్రభుత్వం ఈ నాలుగున్నరేళ్లుగా ధార్మిక పరిషత్‌ ఏర్పాటుపై దృష్టి పెట్టలేదు. ఆలయాలపై ప్రభుత్వానికి సమాంతరంగా ధార్మిక పరిషత్‌ పెత్తనం ఉంటుందన్న ఉద్దేశంతో దాన్ని ఏర్పాటు చేయని ప్రభుత్వం ఇప్పుడు పాలకమండళ్ల నియామకాలకు మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపుతోంది. చంద్రబాబు ప్రభుత్వం మరో ఆరు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుంది.. కానీ పాలకమండళ్లను మాత్రం రెండేళ్ల కాలపరిమితికి నియమిస్తుండటం గమనార్హం.

దేవాలయాలపై టీడీపీ నేతల పెత్తనానికే..
దేవాలయాల పాలకమండళ్లకు ఎంపికవుతున్న టీడీపీ నేతలు దేవుడి సొమ్మును దిగమింగడానికి అర్చకులు, దేవదాయ శాఖ ఉద్యోగులపై కర్రపెత్తనం చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కణుపురం శివాలయంలో పనిచేసే మల్లిఖార్జున శర్మ అనే అర్చకుడు ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు పేర్కొంటూ చనిపోయే ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వేదాంతం కృష్ణకిశోర్‌ అనే అర్చకుడు ఆలయ మాజీ ధర్మకర్తలు తనను వేధింపులకు గురి చేస్తున్నట్టు సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వెళ్లగక్కారు. విజయవాడ దుర్గమ్మ గుడిలో ఆలయ ఈవోలుగా పనిచేసిన ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు అక్కడి నుంచి బదిలీ కావడం వెనుక ఆలయ పాలక మండలి సభ్యులతో వారికి పొసగకపోవడమే కారణమనే వార్తలు వినిపించాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top