ఆ సంఘటనలో తప్పెవరిది.?

TDP Leader Vs Police Officer In Mydukur Town - Sakshi

ఎస్‌ఐపై చేయిచేసుకొన్న టీడీపీ నాయకుడిదా..?

నాయకులపై చేయి చేసుకొన్నఎస్‌ఐదా..

పోలీసులకే రక్షణ కరువవుతోందా.!

మైదుకూరు పోలీసు స్టేషన్‌లో శాంతిభద్రతలకు విఘాతం

మైదుకూరు టౌన్‌ : మైదుకూరు నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుడి అనుచర వర్గం వ్యవహరిస్తున్న వైఖరి.. ఆ వర్గం నాయకుల ప్రవర్తను ఆపేందుకు పోలీసులు వ్యవహరించిన తీరు ప్రస్తుతం మైదుకూరు నియోజకవర్గంలో హాట్‌ టాపిక్‌గా  మారాయి. గత శనివారం రాత్రి మైదుకూరు పోలీస్‌ స్టేషన్‌లో టీడీపీ నాయకుడు బాలరాజ్‌ యాదవ్‌పై అర్బన్‌ ఎస్‌ఐ రామకృష్ణ దాడి చేశారు. అయితే దాడికి ముందు అధికార పార్టీ నాయకుడి సామాజిక వర్గానికి చెందిన బాలరాజు యాదవ్‌ ఎస్‌ఐపై చేయి చేసుకోవడమే ముఖ్య కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ సామాజిక వర్గం నాయకుల మధ్య జరిగిన గొడవే ఈ వివాదానికి కారణం. కొద్ది రోజుల క్రితం  పట్టణంలోని వనిపెంట రోడ్డులో జేడీ ఆయిల్‌ మిల్‌ యజమాని అశోక్‌ యాదవ్‌కు, ఖాజీపేట మండలానికి చెందిన నాగార్జున యాదవ్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం నాగార్జున మరో ఇద్దరు వ్యక్తులు ఆయిల్‌మిల్‌ వద్దకు వెళ్లి ఆర్థిక విషయాల గురించి మాట్లాడుకొని తిరిగి పట్టణంలోకి వస్తుండగా పొట్టి శ్రీరామలు విగ్రహం వద్ద  ఏఎస్‌ఐ సుబ్బన్న వాహనాలు తనిఖీ చేస్తుండగా నాగార్జున యాదవ్‌ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో పట్టుబట్టాడు.

అయితే ఈ విషయం తెలుసుకొన్న బాలరాజు యాదవ్‌ స్టేషన్‌ వద్దకు వచ్చి ‘ మేము ఎవరో తెలియదా మా వర్గంపైనే కేసులు పెడతారా’ అంటూ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మాట్లాడుతుండగా హెడ్‌కానిస్టేబుల్‌ గుర్రప్ప అరవద్దు బయటకు రండి అంటూ బాలరాజు యాదవ్‌ను పక్కకు తీసుకొని వచ్చాడు. ఇదే సమయంలో స్టేషన్‌లో తన కుర్చీలో కూర్చుని  ఉన్న ఎస్‌ఐ రామకృష్ణ బయటకు వచ్చి బాలరాజు యాదవ్‌తో మాట్లాడుతుండగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం చొక్కాలు పట్టుకోవడంతో ఎస్‌ఐ పక్కనే ఉన్న చెట్టువద్ద కిందపడ్డాడు. అయితే సిబ్బంది భాగ్యంరెడ్డి, కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ మరికొంత మంది బాలరాజు యాదవ్‌ను లోపలికి తీసుకెళ్లి లాకప్‌లో వేశారు. మాటలు పెరగడంతో ఎస్‌ఐ అతనిపై చేయిచేసుకున్నాడు.

పక్క స్టేషన్‌లో ఉన్న రూరల్‌ సీఐ హనుమంత నాయక్‌ సంఘటన స్థలం వద్దకు వచ్చి ఎస్‌ఐతో మాట్లాడుతుండగా విషయం తెలుసుకొన్న కొంతమంది అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో ఓ పత్రికా విలేకరి సుబ్బారావు ఈ దృశ్యాన్ని తనసెల్‌ ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా ఎస్‌ఐ, సిబ్బంది సెల్‌ఫోన్‌ లాక్కొని అందులోని డేటాను సీఐ ఎదుటే తొలగించడంతో పాటు అసభ్య పదజాలంతో తిట్టి తనను కొట్టారని సుబ్బారావు తెలిపాడు. ఈ విషయంపై ఎస్‌ఐ రామకృష్ణను వివరణ కోరగా ‘స్టేషన్‌ లోపల తమ అనుమతి లేనిదే ఫొటోలు తీయకూడదని, అలా ఫొటోలు తీస్తుంటే సెల్‌ఫోన్‌ తీసుకొని సీఐకి ఇచ్చానే కాని ఎలాంటి దాడి చేయలేదని’ ఎస్‌ఐ పేర్కొన్నారు. కాగా, ఎస్‌ఐపై దాడి ఇతర గొడవ ఇదంతా ఓ హెడ్‌కానిస్టేబుల్‌ ఊతంతోనే జరిగిందని పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకుని బాధ్యులపై చర్యలు తీసుకుంటే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top